పామాయిల్‌ సాగు అంతంతే! | - | Sakshi
Sakshi News home page

పామాయిల్‌ సాగు అంతంతే!

Apr 18 2025 5:36 AM | Updated on Apr 18 2025 7:41 AM

పామాయిల్‌ సాగు అంతంతే!

పామాయిల్‌ సాగు అంతంతే!

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తొలుత సిద్దిపేటలో సాగు
● ఇప్పటి వరకు 4,515 మంది రైతులు.. 15వేల ఎకరాల్లో సాగు ● గతేడాది 10వేల ఎకరాల లక్ష్యానికి సాగైంది 3వేలు మాత్రమే ● ఈ ఏడాదైనా సాగు పెంచేందుకు అధికారులు కృషి చేయాలి

సాక్షి, సిద్దిపేట: పామాయిల్‌ను అంతంత మాత్రంగానే సాగు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా సాగు చేస్తే వచ్చే లాభాలపై అవగాహన సదస్సులు విస్తృతంగా నిర్వహించి.. రైతులను అటు వైపు మళ్లించారు. ఏడాదిన్నర నుంచి అఽధికారులు , ప్రజాప్రతినిఽధులు అవగాహన కల్పించకపోవడంతో పాటు నీటి ఇబ్బందులతో పామాయిల్‌ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

15వేల ఎకరాల్లో సాగు..

తొలుత సిద్దిపేట జిల్లాలో రెండేళ్ల తర్వాత మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో పామాయిల్‌ సాగును ప్రారంభించారు. ఉమ్మడి మెదక్‌లో 4,515 మంది రైతులు, 15,134 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో మొక్కలను తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌, మెదక్‌, సంగారెడ్డిలలో ప్రైవేట్‌ కంపెనీలు అందజేస్తున్నాయి. గతేడాది ఉమ్మడి మెదక్‌ జిల్లాకు ఉద్యాన శాఖ 10వేల ఎకరాలు లక్ష్యంగా నిర్ణయించగా 3,110 ఎకరాల్లోనే సాగు చేస్తున్నారు. ఇటీవల పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు సందర్శించిన అనంతరం అధికారులతో సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాగు తక్కువగా ఉండటంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్‌ అధికారులు సమన్వయంతో సాగుతూ సాగు విస్తీర్ణం పెంచే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. గతంలో పామాయిల్‌ సాగుకు అధిక ప్రాధాన్యమిచ్చి పెద్ద రైతులను గుర్తించి వారితో ప్రత్యేకంగా మాట్లాడి వారిని పామాయిల్‌ సాగు చేసే విధంగా ప్రోత్సహించారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ఇక్కడే విక్రయించుకొనే అవకాశం

ఇప్పటికే సిద్దిపేటలో పామాయిల్‌ సాగవుతున్న పలు చోట్ల దిగుబడి ప్రారంభమైంది. గెలలు కోసి సిద్దిపేటలోనే విక్రయించి రైతులు ఆదాయం పొందారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెటలో పామాయిల్‌ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. త్వరలో అందుబాటులోకి రానుంది. దీంతో మార్కెటింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైతులను పామాయిల్‌ సాగు చేసే విధంగా ప్రోత్సహిస్తే ఎంతో మేలు జరగనుంది.

ఎకరానికి రూ.50 వేల రాయితీ

రైతులను ప్రోత్సహించేందుకు పలు రకాల సబ్సిడీని అందిస్తోంది. ఎకరం ఆయిల్‌ పామ్‌ సాగు కోసం ప్రభుత్వం రూ. 50,600 రాయితీ ఇస్తున్నది. మొక్కలకు 80 శాతం సబ్సిడీ, అలాగే డ్రిప్‌ సిస్టమ్‌ కోసం బీసీలకు 90 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీతో అందిస్తున్నారు. ఇలా 12.5ఎకరాల వరకు రైతులకు ప్రభుత్వం నుంచి రాయితీలు పొందే అవకాశం ఉంది. అలాగే మొక్కలు నాటిన నాలుగేండ్ల వరకు కాత రాదు. ఈ సమయంలో మొక్కల సంరక్షణతో పాటు ఆయిల్‌ పామ్‌ అంతర పంట సాగు కోసం ప్రభుత్వం రూ.4,200 చొప్పున నాలుగేండ్లకు రూ.16,800 చెల్లిస్తుంది. ఈ సాగుతో నాలుగేండ్ల తర్వాత నుంచి 30 ఏండ్ల వరకు నిరంతర ఆదాయాన్ని పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement