కోటి తలంబ్రాల దీక్ష అద్భుత ఘట్టం
జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ప్రియాంక
గజ్వేల్‌రూరల్: కోటి తలంబ్రాల దీక్ష అద్భుత ఘట్టమని గజ్వేల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ప్రియాంక అన్నారు. భద్రాచల సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా 250 కిలోల గోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు రామకోటి రామరాజుకు ఆ దేవస్థాన పాలకమండలి అప్పగించింది. గోటి తలంబ్రాలను సిద్ధం చేసి తిరిగి భద్రాచలంలో అప్పగించేందుకు తీసుకెళ్తున్న సందర్భంగా ప్రజ్ఞాపూర్‌లోని త్రిశక్తి అమ్మవారి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్జి ప్రియాంక మాట్లాడుతూ కోటి తలంబ్రాల దీక్షలో ప్రాంత ప్రజలను భాగస్వాములను చేయడం పట్ల రామకోటి రామరాజును అభినందించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో త్రిశక్తి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


