గొంతు తడుపుదామిలా.. | - | Sakshi
Sakshi News home page

గొంతు తడుపుదామిలా..

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

సంగారెడ్డి జోన్‌/ పుల్‌కల్‌ (అందోల్‌): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులేర్పడ్డాయని తాగునీటి, సాగునీటికి భవిష్యత్తులో ఇబ్బందులేర్పడతాయని వీటన్నింటినీ అందరం కలసికట్టుగా ఎదుర్కొందామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు స్పష్టం చేశారు. క్రాఫ్‌ హాలీడే గురించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సింగూరు ప్రాజెక్టును గురువారం సందర్శించి ఎల్‌నినో వల్ల జరిగే నష్టాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ విషయంపై అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో విద్యుత్‌, తాగు, సాగునీరు, యాసంగి పంటలపై విద్యుత్‌, వ్యవసాయ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో చర్చించారు. వేసవిలో మరింత నీటిమట్టం పడిపోతుందని భూగర్భ జలాల అధికారులు సీఎస్‌కు సూచించారు. రైతులకు వరి, పత్తి పంటలకు బదులు కూరగాయలు సాగుచేసేలా ప్రోత్సహించాలని, ఈ పక్షం రోజులు వానాకాలం పంటలను కాపాడాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.

దసరా తర్వాత రోజు విడిచి రోజు

సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటిపోతుండటంతో దసరా తర్వాత నుంచి రోజు విడిచి రోజు తాగునీటిని సరఫరా చేస్తామని మిషన్‌ భగీరథ అధికారులు సీఎస్‌కు తెలిపారు. రోజు విడిచి రోజు తాగునీటిని సరఫరా చేస్తేనే వేసవిలో నీటి ఎద్డడిని తట్టుకో గల్గుతామని సూచించారు.

ప్రాజెక్టు నీటి నిల్వల పరిశీలన

అంతకుముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు డ్యామ్‌లో నీటి మట్టాన్ని పరిశీలించి నీటిపారుదల శాఖ అధికారులతో నీటి నిల్వ సామర్థ్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. సింగూరు డ్యామ్‌ ద్వారా, మంజీరా బ్యారేజ్‌ ద్వారా జంటనగరాలకు తాగునీటిని సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. సుల్తాన్‌పూర్‌లో కౌలు రైతు చేనులో పత్తి పంటను పరిశీలించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఎకరాకు రెండు క్వింటాళ్ల పత్తే వస్తుందని కౌలు రైతు సీఎస్‌కు వివరించారు. సీఎస్‌ వెంట కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, ఎస్పీ పంకజ్‌, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులున్నారు.

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పొంచివున్న నీటి ఎద్దడిని తీర్చేందుకు రూ.39 కోట్లను మంజూరు చేయాలని మిషన్‌భగీరథ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలు ఇటీవలే ఆ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యాలయం ద్వారా ప్రభుత్వానికి వెళ్లాయి. ఈ నిధుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్‌జాజు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గురువారం సీఎస్‌ సింగూరు ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టులోని నీటి లభ్యత ఉన్న నామమాత్రపు నీటి వనరులతో ఎన్ని రోజులకు నీటి సరఫరా చేయవచ్చు వంటి అంశాలపై నీటిపారుదల, మిషన్‌భగీరథ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ విభాగాల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా నీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రత్యామ్నాయ చర్యల కోసం ఈ నిధులు అవసరమని అధికారులు సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నిధులు మంజూరు చేస్తామని సీఎస్‌ చెప్పినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ట్యాంకర్లే కోసమే ఎక్కువ నిధులు

ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ప్రణాళికలో భాగంగా ట్యాంకర్లతో నీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఉన్న ట్యాంకర్లతోపాటు, అవసరమైతే ప్రైవేటు ట్యాంకర్లను తీసుకుని సమస్య ఉన్న ప్రాంతాల్లో తాగునీటిని సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఇలా ట్యాంకర్లతో నీటి సరఫరాకు చేయాల్సిన నివాసిత ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఎక్కడెక్కడ నీటి కొరత ఏర్పడుతుందో ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. అలాగే అవసరమైన చోట్ల ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన బోర్లను కూడా అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సోర్స్‌ ఎండిపోతే ఈ ప్రైవేటు బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. ఇలాంటి బోర్లు ఎక్కడెక్కడ అవసరం ఉంటాయనే దానిపై ఓ అంచనాకు వచ్చారు.

పొంచివున్న నీటి ఎద్దడి నేపథ్యంలో...

జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కలిపి మొత్తం 943 నివాసిత ప్రాంతాలున్నాయి. వీటి పరిధిలో 2.65 లక్షల నల్లా కనెక్షన్లకు నీటి సరఫరా జరుగుతోంది. ఇందుకు ప్రధాన నీటి వనరు సింగూరు జలాశయమే. దీని పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా..నీటి మట్టం డెడ్‌ స్టోరేజీకి చేరుకుంటోంది. ప్రస్తుతం కేవలం 3.4 టీఎంసీలు మాత్రమే మిగిలాయి. డెడ్‌స్టోరేజీ 0.9 టీఎంసీలు పోగా కేవలం 2.5 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. అయితే దసరా తర్వాత రెండు రోజులకు ఒకసారి నీటి సరఫరా చేస్తామని ఆశాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో నవంబర్‌ నుంచి నీటి కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. ఈ నేపథ్యంలో మిషన్‌భగీరథ అధికారులు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గురువారం సింగూరును సందర్శించిన సీఎస్‌ ఈ ప్రతిపాదనలపై అధికారులతో సమీక్షించి నిధుల మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ట్యాంకర్లతో సరఫరా.. అద్దెకు బోర్లు

రూ.39 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళిక

ప్రభుత్వానికి వెళ్లిన ప్రతిపాదనలు

నిధుల మంజూరుకు సీఎస్‌ సంజయ్‌జాజు గ్రీన్‌ సిగ్నల్‌!!

మిషన్‌భగీరథ అధికారుల ప్రతిపాదనలకు మోక్షం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement