పలు ఆలయాల్లో కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు
పటాన్చెరు టౌన్/నారాయణఖేడ్/మునిపల్లి(అందోల్)/వట్పల్లి(అందోల్)/రాయికోడ్(అందోల్): దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయాల్లో ఐదో రోజైన గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించగా వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని భవానీదేవిగా అర్చకులు అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. ఎంజీ రోడ్డులోని మహంకాళి దేవాలయంలో, టోల్గేట్ సమీపంలోని శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో అమ్మవారిని లలితాదేవిగా అర్చకులు అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఖేడ్లోని మనూరు మండలం బోరంచలోని సుప్రసిద్ధ బోరంచ నల్లపోచమ్మ ఆలయంలో, మంగల్పేట్లోని భవానీమాత ఆలయంలో అమ్మవారు లలిత త్రిపుర సుందరీదేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. బుదేరాలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవాలయంలో స్కంద మాత అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అందోల్ మండల పరిధిలోని కన్సాన్పల్లి గ్రామంలో అమ్మవారు అన్నపూర్ణదేవిగా భక్తులకు కనిపించారు. రాయికోడ్లోని ముమ్మాదేవి ఆలయంలో అమ్మవారిని లలితాదేవిగా అర్చకులు అలంకరించారు.


