ఎలాంటి ఆదేశాల్లేవు
ఎన్నికలు నిర్వహించాలి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): గత 20 ఏళ్లుగా నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో జిల్లాలోని చెరువులు పర్యవేక్షణ లేక అధ్వాన్నంగా మారాయి. జిల్లాలో 3,140 చెరువులు ఉండగా, వాటికీ పర్యవేక్షణ కరువై అభివృద్ధికి నోచుకోవడం లేదు. మరోవైపు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులు, కుంటలకు మరమ్మతులు చేసినా వాటిపై అజమాయిషీ లేక నీటి విడుదల, మరమ్మతులపై దృష్టిపెట్టేవారే ఇప్పుడు కరవయ్యారు. ఒకప్పుడు చెరువుల అభివృద్ధి, నిర్వహణ, ఆయకట్టుకు నీటి సరఫరా చేయడం తదితర పర్యవేక్షణ పనులు నీటి సంఘాలు పాలకవర్గాలు చేపట్టేవి. గత 20 ఏళ్లుగా ప్రభుత్వాలు నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించకపోవడంతో పర్యవేక్షణ కరువైంది. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పనులు చేపట్టక ముందే నిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వాలు మారినా నీటి సంఘాలకు మాత్రం ఎన్నికలు నిర్వహించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఇలా..
గతంలో ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగానే 100 ఎకరాల ఆయకట్టున్న ప్రధాన చెరువుల ఆయకట్టుకు రైతులు చైర్మన్తోపాటు డైరెక్టర్లను ఎన్నుకునేవారు. పాలకవర్గ సభ్యులు చెరువుల నిర్వహణతోపాటు పంట పొలాలకు నీటిని విడుదల చేసుకుని పొదుపుగా వాడుకునేలా చర్యలు తీసుకునేవారు. అంతేకాకుండా రైతులను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు నిర్వహించేవారు. 20 ఏళ్ల నుంచి నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించకపోవడంతో చెరువుల నిర్వహణ అధ్వాన్నంగా మారింది. కొన్ని చెరువులు పూడుకుపోయాయి. తూములు పనిచేయక సాగునీరు నిరుపయోగంగా మారింది. రాజకీయ నాయకుల అధికారుల అండదండలతో మట్టి మాఫియా చెరువులోని నల్లమట్టిని జేసీబీ యంత్రాల సహాయంతో తోడి రాత్రి పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా ఇటుక బట్టీలకు సరఫరా చేస్తున్నారు. చెరువులో నుంచి నల్లమట్టి తీయడంతో భారీ గుంతలేర్పడి ఎందరో అమాయకులు నీట మునిగి మృతి చెందిన సందర్భాలున్నాయి.
2008 నుంచి ఎన్నికలు బంద్
వంద ఎకరాల ఆయకట్టుకు పైగా ఉన్న ప్రధాన చెరువులకు రెండేళ్ల కాలానికి సాగునీటి సంఘాలకు 2006లో ఎన్నికలు నిర్వహించగా వాటి పదవీకాలం 2008లో ముగిసింది. అప్పటినుంచి ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమైనా నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించి చెరువులను మరింత అభివృద్ధి చేయాలని రైతులు,రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.
2008 నుంచి పాలకవర్గాలు కరువు
కానరాని చెరువుల పర్యవేక్షణ, అభివృద్ధి
ఎన్నికలు నిర్వహించాలని రైతుల డిమాండ్
జిల్లాలో 3,140 చెరువులు
నీటి సంఘాల ఎన్నికలపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. గతంలో వంద ఎకరాల ఆయకట్టుకు పైగా ఉన్న ప్రధాన చెరువులకు ఎన్నికలను నిర్వహించి చైర్మన్,డైరెక్టర్లను ఎన్నుకునే విధానం ఉండేది.
–జై భీం, ఈఈ ఇరిగేషన్ సంగారెడ్డి
చాలా ఏళ్లుగా నీటి సంఘాలకు ఎన్నికలు జరగకపోవడంతో చెరువులు కనుమరుగవుతున్నాయి. కొన్ని చోట్ల కబ్జాలకు గురవుతున్నాయి. వెంటనే ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించి చెరువులను సంరక్షించాలి.
– పృథ్వీరాజ్, మంజీర రైతు సమాఖ్య అధ్యక్షుడు,సంగారెడ్డి


