జాబితాపై పార్టీల పరిశీలన
సంగారెడ్డి జోన్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై గ్రామాలు, పట్టణాల్లో సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 27 నుంచి గ్రామ, వార్డు సభలు నిర్వహించి ముసాయిదా జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలు ఆయా బూత్ లెవల్ అధికారులు చదివి వినిపించనున్నారు.
కొత్త ఓటరు నమోదుకు అవకాశం
ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాను బూత్‌స్థాయి అధికారులు చదివి వినిపించడంతో పాటు అందుబాటులో ఉంచుతారు. అర్హులైన వారు జాబితాలో లేకుంటే గుర్తిస్తారు. అదేవిధంగా చనిపోయిన వారి, డూప్లికేట్ ఓటు, గ్రామాలు పట్టణాలను విడిచి ఇతర ప్రాంతాల్లో నివాసం ఉన్న వారి ఓటర్లను గుర్తిస్తారు. 2026 అక్టోబర్ 1 వరకు 18 సంవత్సరాలు నిండి ఉన్న వారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. జాబితాలో వివరాలు తప్పుగా ఉంటే సవరణకు, అనర్హుల ఓటర్లను తొలగించేందుకు ఫిర్యాదులు, అభ్యంతరాలు తెలుపవచ్చు. జాబితాలో అనర్హుల ఓటరు తొలగింపు కోసం సంబంధిత నియోజకవర్గం ఓటరు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16 వరకు ముసాయిదా జాబితాపై ఫిర్యాదులు చేసుకునే అవకాశం ఉంది. వచ్చిన ఫిర్యాదులు అక్టోబర్ 15 వరకు పరిశీలించి, పరిష్కరించనున్నారు. అనంతరం తుది ఓటరు జాబితా ప్రకటిస్తారు.
ముసాయిదా ఓటర్లు 11,59,158
ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటర్ జాబితా ప్రకారం జిల్లాలో 11,59,158 మంది ఉన్నారు. వీరిలో 5,75,067 మంది పురుషులు, 5,84,027 మంది మహిళలు, 64 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియకు ముందు 14,57,436 మంది ఓటర్లు ఉన్నారు. డిజిటలైజేషన్ అనంతరం 11,59,158 మంది ఉన్నట్లు గుర్తించారు. 2,98,278 మంది ఓటర్లను వివిధ కారణాలతో జాబితా నుంచి తొలగించారు. 3,47,688 మంది ఓటర్లకు నోటీసులు అందించనున్నట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారు సరైన ఆధారాలు చూపించి ఓటరుగా నిరూపించుకోవాలి.
రేపటి నుంచి గ్రామ, వార్డు సభలు
తొలగింపు, చేర్పులతో పాటు కొత్త వారికి ఛాన్స్
జాబితాలో అర్హుల పేర్లు తొలగిపోతే గుర్తింపు
ముసాయిదా ఓటరు జాబితాపై నిర్వహించే సభలలో ప్రధాన పార్టీల నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి జాబితాలో ఓటు కల్పించే విధంగా పరిశీలిస్తున్నారు.


