ప్రతి ఏటా కడుతున్న సోదరీమణులు
అక్కన్నపేట(హుస్నాబాద్): అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. అయితే తమ సోదరుడు చనిపోయినా అతని విగ్రహానికి రాఖీలు కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎంత గొప్పదో చాటుతున్నారు. మండలంలోని దుబ్బతండా గ్రామపంచాయతీ పరిధిలోని రాజుతండాకు చెందిన గుగులోతు నరసింహనాయక్ సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తూ 2014లో నక్సల్స్ మందుపాతరలో మృతి చెందాడు. అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు లింగయ్యనాయక్, సత్తవ్వ తమ వ్యవసాయ పొలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అతడికి ముగ్గురు అక్కలు ఉన్నారు. ఒక్కగానొక్క సోదరుడు చనిపోవడంతో తాము రాఖీ ఎవరికి కట్టాలని అతని సోదరీమణులు విగ్రహంలోనే తమ్ముడిని చూసుకుంటున్నారు. ఏటా రాఖీ పండుగకు విగ్రహానికి రాఖీ కడుతారు. అలాగే ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా నరసింహనాయక్ విగ్రహం ఎదుట జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుతున్నారు.


