పల్లెలు..
ఇవి మన ఊటీలు ● వెండితెరకు తళుకులు ● మా ఊరు.. పల్లె‘టూరు’
వర్గల్(గజ్వేల్): ఆలయాలు, వాగులు, వంకలు, పల్లెలు, పచ్చని పంటపొలాలతో ప్రకృతి రమణీయతల నెలవైన వర్గల్ మండలం పలు సినిమా షూటింగులతో వెండి తెరపై తళుక్కుమన్నది. 2022లో విడుదలైన ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా షూటింగ్ 80 శాతం వర్గల్ మండలం వేలూరులోనే జరిగింది. వేలూరు నరసింహస్వామి ఆలయం, గ్రామంలోనీ పాత ఇళ్లు, ఇరుకు సందులు, పొలాలు లొకేషన్లుగా దాదాపు 25 రోజులు ఇక్కడ షూటింగ్ జరగడం విశేషం. అదే గ్రామం వేలూరుకు చెందిన బాలనటుడు ములుగు జయతీర్థ, తాప్సీ, హర్ష్ రోషన్, భాను ప్రకాశ్ నటీనటులుగా.. ‘గ్రామీణ వాతావరణంలో పెరిగిన ముగ్గురు చిన్న పిల్లలు తెలియని వయసులో వారి ఆశయ సాధనకై సొంత ఊరు విడిచి బెంగళూరుకు పారిపోవడం, వారి ద్వారా చిన్నపిల్లలని కిడ్నాప్ చేసే ఒక అంతర్జాతీయ స్థాయి ముఠాను పట్టుకోవడం’ కథాంశంగా 2022లో తెరకెక్కిన ఈ సినిమా చక్కని ప్రేక్షకాదరణ చూరగొన్నది.
వేణుగోపాలుని కోవెలలో ‘అద్భుతం’
నాటి చరిత్ర చాటే వర్గల్ వేణుగోపాలుని కోవెల లొకేషన్‌గా మూడేళ్ల క్రితం తేజ హీరోగా, శివాని కథానాయికగా ‘అద్భుతం’ సినిమా కోసం ‘వెన్నెల్లో గోదారి.. చూస్తూనే ఓసారి’ పాట షూటింగ్ జరిగింది. అదే విధంగా గుడితోపాటు, వర్గల్ ఊడల మర్రి, నగరం తండా తదితర లొకేషన్లలో ‘ఇట్లు’ సినిమా షూటింగ్ జరిగింది. షూటింగులతో ప్రత్యేకత చాటుకుంటూ వెండితెరపై వర్గల్ తణుకులీనుతోంది.
మొన్నటి ‘మిషన్ ఇంపాజిబుల్’
నుంచి నేటి ‘పళ్ల బురుసు’ దాకా
సినిమా షూటింగ్ స్పాట్‌గా ఉమ్మడి మెదక్ జిల్లా
బాల నటుడిగా సెవెన్త్ చదువుతున్నపుడు సినిమాలో అవకాశం అంటే ఎగిరి గంతేశా.. మా సొంత గ్రామంలోనే షూటింగ్ అని తెలిసి ఉబ్బి తబ్బిబ్బయ్యా. బంజరాహిల్స్ యడిషన్‌లో నన్ను లీడ్ రోల్‌కు ఎంపిక చేశారు. మా గ్రామంలోని నృసింహాలయం, ఇళ్ల సందుల్లో, పంట పొలాల్లో, ఊరి వాగు దగ్గర దాదాపు 25 రోజులు షూటింగ్ కొనసాగింది. ‘మిషన్ ఇంపాజిబుల్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా నాకు మైలురాయి. గ్రామంలోనే షూటింగ్ 80 శాతం జరగడం మరచిపోలేని అనుభూతి. నేను ప్రస్తుతం బీటెక్ చదువుతున్న. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అనుభవం సాధించా. మా నాన్న జబర్దస్త్ ఫేమ్ లక్ష్మీకిరణ్ నన్ను ఆర్టీస్టుగా తీర్చిదిద్దారు.
– ములుగు జయతీర్థ(వేలూరు)
పల్లెలు.. చిత్ర సీమలవుతున్నాయి. ప్రకృతి అందాలు మేళవించిన గ్రామాలు సినీ లొకేషన్లు అవుతున్నాయి. పెంకుటిళ్లు, పచ్చని పంట పొలాలు, గుడులు, వాగులు, వంకలు షూటింగ్ స్పాట్లుగా విలసిల్లుతున్నాయి. గ్రామీణాన్ని వెండి తెరపైకెక్కిస్తూ సినీ నిర్మాతలు ‘ఇవి మన ఊటీ’లు అని చాటుతున్నారు. ఫిల్మ్‌షూటింగుల అడ్డాగా మార్చుకుంటున్నారు. ‘మా ఊరు.. పల్లె‘టూరు’.. అన్నట్లు గ్రామీణంపై ఫోకస్‌గా ‘మిషన్ ఇంపాజిబుల్, ఇట్లు, అద్భుతం, పళ్ల బురుసు, ఓ సుకుమారి’ తదితర సినిమా షూటింగ్‌లకు ఉమ్మడి మెదక్ జిల్లా వేదికగా నిలిచి సినీరంగంలోనూ ప్రత్యేకత చాటుకుంటోంది.


