బోనస్‌కు రిజిస్ట్రేషన్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

బోనస్‌కు రిజిస్ట్రేషన్‌ చేయాలి

Aug 20 2026 7:32 AM | Updated on Aug 20 2026 7:32 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌): సన్నరకం వరిధాన్యం బోనస్‌ కోసం రైతులు విత్తనాలు కొన్న దుకాణంలో ఆన్‌లైన్‌లో విత్తన రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఏఓ స్వప్న తెలిపారు. ప్రభుత్వం బీపీటీ 5204(సాంబమసూరి), ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరాం, కేఎన్‌ఎం 1638, డబ్ల్యూజీఎల్‌ 44(సిద్ది), కేఎన్‌ఎం 7715 ఈ ఏడు రకాల సన్నరకం వరిధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇవ్వనుందని సూచించారు. ఈ ఏడు రకాల వరి సాగు చేస్తున్న రైతులు ఏ దుకాణంలో విత్తనాలు కొనుగోలు చేస్తారో అక్కడ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించి ఈనెల 24, 25వ తేదీల్లో పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌ జిరాక్స్‌ పత్రాలు వ్యవసాయ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.

పీఏసీఎస్‌ సెక్రటరీ సస్పెన్షన్‌

కల్హేర్‌(నారాయణఖేడ్‌): సిర్గాపూర్‌ మండలంలోని బోక్కస్‌గాం పీఏసీఎస్‌ సెక్రటరీ సతీశ్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా సహకార అధికారి కిరణ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఏసీఎస్‌లో నిధుల దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదు మేరకు నారాయణఖేడ్‌ సబ్‌కలెక్టర్‌ ఉమాహారతి విచారణ చేసి నివేదిక అందజేశారు. ఈ మేరకు సెక్రటరీ సతీశ్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు.

తల్లీబిడ్డల కోసమే

మాతృదేవోభవ

కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ

ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి

నర్సాపూర్‌: తల్లీబిడ్డల ఆరోగ్యానికి తోడ్పడాలనే ఉద్దేశంతో మాతృదేవోభవ కార్యక్రమం చేపట్టి అమలు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని శివాలయం సమీపంలో గర్భిణులకు పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. తన సొంత నిధులతో మాతృదేవోభవ కార్యక్రమం చేపట్టి అమలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలన్న ఉద్దేశంతో గర్భిణులకు తన వంతుగా పోషకాహార కిట్లు అందజేస్తున్నానని చెప్పారు. కాగా 130మంది గర్భిణులకు పోషకాహార కిట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

గుర్తుతెలియని బైక్‌

స్టేషన్‌కు తరలింపు

శివ్వంపేట(నర్సాపూర్‌): మండల కేంద్రమైన శివ్వంపేటలో రోడ్డు పక్కన ‘గుర్తుతెలియని బైక్‌ పార్కింగ్‌’పై కథనం సాక్షి దినపత్రికలో బుధవా రం ప్రచురితం కావడంతో పోలీసులు స్పందించారు. సదరు బైక్‌ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బైక్‌ రామంతపూర్‌కు చెందిన వ్యక్తిగా ఆర్‌సీ నమోదై ఉందని, ఈ బైక్‌పై మూడు చలాన్లు ఉన్నట్లు ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం బైక్‌ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌

పుల్‌కల్‌(అందోల్‌): నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటేడ్‌ స్కూల్‌ వద్ద జరిగిన చోరీ కేసులో పోలీసులు దొంగలను అరెస్టు చేశారు. బుధవారం జోగిపేట సీఐ అనిల్‌కుమార్‌ కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ అనంతపూర్‌కు చెందిన మరాటి ప్రకాశ్‌ , శివంపేటకు చెందిన చాపల సురేశ్‌, కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన నానంపేట అనిల్‌, గోసాని రాంచందర్‌, శివంపేటకు చెందిన చాపల గోపాల్‌ ముఠాగా ఏర్పడి వివిధ రాష్ట్రాల్లో చోరీలు చేస్తున్నారు. వీరిపై పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. ఈనెల 9న సింగూరు డ్యాం వద్ద దావత్‌ చేసుకొని తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో బస్వాపూర్‌ శివారులోని ఇంటిగ్రేటేడ్‌ స్కూల్‌ నిర్మాణ స్థలంలో 45 అల్యూమినియం ప్యానల్‌లను దొంగిలించి, ట్రాలీ వాహనంలో తరలించారు. కాగా ఇందుకు తాడ్‌దాన్‌పల్లి టోల్‌ వద్ద ఫోన్‌పే ద్వారా ఫీజును సైతం చెల్లించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

హత్య కేసులో

నిందితుడికి జీవిత ఖైదు

సంగారెడ్డి క్రైమ్‌: చిన్నారి హత్యకేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. సంగారెడ్డి టౌన్‌ పోలీసుల వివరాల ప్రకారం.. నర్సాపూర్‌ మండలం సిర్పూర్‌ గ్రామానికి చెందిన మూడవ సురేశ్‌ సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్‌లో నివాసం ఉండేవాడు. మద్యం మత్తులో రెండున్నరేళ్ల చిన్నారిపై దాడి చేయడంతో మృతి చెందింది. పోలీసులు కేసు నమో దు చేసి, జిల్లా న్యాయస్థానంలో హాజరు పరచారు. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ. 500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement