అల్లాదుర్గం(మెదక్): అధికారుల నిర్లక్ష్య ధోరణి పేద పిల్లలకు శాపంగా మారింది. వంట కార్మికులు విద్యార్థులకు నాణ్యతలేని భోజనం పెడుతున్నారు. దీంతో ఈ ఘటనపై అధ్వానంగా మధ్యాహ్న భోజనం అనే శీర్షికతో సాక్షి బుధవారం వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ఆగ్రహించిన మండలంలోని గోల్లకుంట తండా ప్రాథమిక పాఠశాల వంట కార్మికులు ఏకంగా మధ్యాహ్న భోజనాన్ని బంద్ చేశారు. కొంత కాలంగా నీళ్ల చారుతో విద్యార్థులకు భోజనం పెడుతుంటే అధికారులు పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. హెచ్‌ఎం, వంటకార్మికులు కుమ్మకై ్క విద్యార్థుల పొట్ట కొడుతున్నారని తండావాసులు ఆరోపించారు. మొదటి నుంచి అధికారులు పర్యవేక్షించక పోవడం, తాము వండకుంటే మరొకరు లేరని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని చెప్పారు. జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక ఎంఈఓ లక్ష్మణ్‌ను వివరణ కోరగా.. విద్యార్థులకు భోజనం అందించేందుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మధ్యాహ్న భోజనం బంద్ చేసిన వంట నిర్వాహకులపై విచారణ చేపడతామన్నారు.


