తప్పిన ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం
మునిపల్లి(అందోల్): షార్ట్ సర్క్యూట్‌తో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం మండల పరిధిలో చోటు చేసుకుంది. మహారాష్ట్ర నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వెళ్తుంది. మునిపల్లి మండలం కంకోల్ టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే బస్సులో బ్యాటరీ నుంచి సప్లయి ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో బస్సు ఇంజిన్ దగ్గర పొగలు, మంటలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును ఆపి 45 మంది ప్రయాణికులను కిందకు దించి మంటలు ఆర్పారు. అనంతరం ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. బుదేరా ఎస్‌ఐ అరవింద్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
పోగొట్టుకున్న బంగారం అప్పగింత
పెద్దశంకరంపేట(మెదక్): పోగొట్టుకున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. సోమవారం ఏఎస్‌ఐ సంగమేశ్వర్ కథనం ప్రకారం.. అల్లాదుర్గం మండలం కాగితపల్లికి చెందిన పత్తి లావణ్య ఈ నెల 14న స్థానిక బస్టాండ్‌లో నాలుగు గ్రాముల బంగారు కమ్మలను పోగొట్టుకుంది. పలు చోట్ల వెతికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా మండల పరిధిలోని బుజ్రాన్‌పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు కమ్మలు దొరికాయని గుర్తించి విచారణ చేపట్టారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని బాధితురాలు లావణ్య కుటుంబసభ్యులకు సోమవారం అప్పగించారు.
మందుబాబులకు జైలు
గజ్వేల్‌రూరల్: మందుబాబులకు కోర్టు జైలు శిక్ష విధించింది. గజ్వేల్ ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. ఇటీవల గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని సోమవారం గజ్వేల్ కోర్టులో హాజరుపర్చగా విచారణ అనంతరం న్యాయమూర్తి.. 10 మందికి రూ. 40 వేల జరిమానాతో పాటు వీరిలో ఆరుగురికి 2 నుంచి 5రోజుల పాటు జైలు శిక్ష విధించారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఆరుగురికి రూ. 5వేల చొప్పున జరిమానా వేశారు.
మెదక్‌లో ముగ్గురికి జరిమానా..
మెదక్ కలెక్టరేట్: మెదక్ పట్టణంలో నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. వీరిని మేజిస్ట్రేట్ సాయి ప్రభాకర్ ఎదుట హాజరు పర్చగా ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ముగ్గురికి రూ.30వేల జరిమానా విధించారు.
కామారం తండా
సర్పంచ్‌కు పీహెచ్‌డీ
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని కామారం తండా సర్పంచ్ మోహన్‌నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టాపొందారు. యూనివర్సిటీ హిందీ విభాగం ప్రొఫెసర్ షీలా మిశ్రా పర్యవేక్షణలో సమకాలీన్ హిందీ నాటకోమె బౌద్ధ దర్శన్ అనే అంశంపై పరిశోధన చేసి వ్యాసం సమర్పించారు. ఓయూ హెచ్‌ఓడీ మాయాదేవి, బీఓఎస్ సంగీత అధ్వర్యంలో పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టా పొందారు. ఈ సందర్భంగా పీహెచ్‌డీ డాక్టరేట్ పొందడంపై ఆయనను పలువురు అభినందించారు.


