ముగ్గురికి స్వల్పగాయాలు
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగికి ఆక్సిజన్ పెడుతున్న క్రమంలో వాల్ ఒక్కసారిగా వేగంగా తెరవడంతో రెగ్యులేటర్ పేలింది. దీంతో డాక్టర్, నర్సుతో పాటు వాచ్‌మెన్, అంబులెన్స్ డ్రైవర్‌లకు స్వల్ప గాయాలై ప్రమాదం తప్పింది. కోహీర్‌కు చెందిన ఓ రోగి వైద్యం కోసం శనివారం జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. రోగికి ఆక్సిజన్ పెట్టాల్సిరావడంతో డాక్టర్ రవికుమార్, సెక్యూరిటీ గార్డ్ రాములు, అంబులెన్స్ డ్రైవర్ ఖాజా మరో నర్సు కలిసి సిలిండర్ వాల్‌ను ఓపెన్ చేస్తున్నారు. ఒక్కసారిగా వాల్ వేగంగా తెరవడంతో పీడనం వల్ల రెగ్యులేటర్ పేలిపోయింది. రెగ్యులేటర్ ముక్కలు కావడంతో రాములు, ఖాజా, డాక్టర్ రవికుమార్‌లకు తగిలి స్వల్ప గాయాలయ్యా యి. వెంటనే అప్రమత్తమైన వారు సిలిండర్‌ను పక్కకు తీసుకెళ్లి వాల్‌ను మూసివేశారు. దీంతో ప్రమాదం తప్పింది.
డబుల్ బెడ్రూం భవనం పైనుంచి దూకి...
గర్భిణి బలవన్మరణం
జహీరాబాద్ టౌన్: కుటుంబ గొడవలతో ఓ నిండు గర్భిణి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం... జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పస్తాపూర్‌లోని బుడగ జంగాలకు చెందిన పూజ(23)కు హోతి(కె) వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం కాలనీలో ఇల్లు వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కాలనీలో రెండవ అంతస్తులో నివాసం ఉంటుంది. ఆమెకు కూతురు ఉండగా ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. మద్యానికి అలవాటు పడిన భర్తతో పాటు అత్త ఆమెతో తరుచూ గొడవపడే వారని.. శుక్రవారం రాత్రి కూడా గొడవపడ్డాడని తెలిసింది. భర్త ఆమెను కొట్టడంతో శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పూజ రెండంతస్తుల భవనం పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయాలైన ఆమెను వెంటనే జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి తల్లి ముంబైలో ఉంటుంది. ఆమె వచ్చే వరకు శవాన్ని ఆస్పత్రిలో భద్రపరిచారు. ఈ మేరకు జహీరాబాద్ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


