అంత్యక్రియలకు ఆపన్నహస్తం | - | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలకు ఆపన్నహస్తం

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

● బాలసదనంలో కన్న పిల్లలు ● అనారోగ్యంతో తండ్రి మృతి ● ఆఖరి క్రతువుకు అండగా నిలిచిన దాత

● బాలసదనంలో కన్న పిల్లలు ● అనారోగ్యంతో తండ్రి మృతి ● ఆఖరి క్రతువుకు అండగా నిలిచిన దాత

సిద్దిపేటజోన్‌: తండ్రి అంత్యక్రియల ప్రక్రియ జరిపించలేని చిన్నారులకు దాత ఆపన్నహస్తం అందించారు. జిల్లా అధికారుల సమక్షంలో దాత సహాయంతో అంత్యక్రియల క్రతువు పూర్తయింది. ఈ ఘటన శనివారం సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి శివ, అంజలి దంపతులు నలుగురు పిల్లలతో బతుకుదెరువు కోసం సిద్దిపేటకు వలస వచ్చారు. రోడ్డు పక్కన చిన్న గుడిసె వేసుకొని జీవనం సాగించారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో 2018లో పిల్లలను బాలసదనం అక్కున చేర్చుకుంది. ఈ నేపథ్యంలో తల్లి అంజలి మూడేండ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయింది. తండ్రి చిన్న చిన్న పనులు చేస్తూ పట్టణంలో ఫుట్‌పాత్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లో తల దాచుకుంటున్నాడు. అనారోగ్యం, మద్యానికి బానిసై దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ శుక్రవారం రాత్రి పట్టణంలో ఫుట్‌పాత్‌పై శివ చనిపోయాడు. విషయం తెలుసుకున్న జిల్లా బాలల సంరక్షణ అధికారి రాము శవాన్ని మార్చురీకి తరలించారు. శివ పిల్లలకు సమాచారం అందించారు.

ఆపన్నహస్తం కోసం..

కన్న తల్లి చనిపోయి, ప్రస్తుతం తండ్రి అనాథ శవంగా మార్చురీలో ఉండడం, బంధువులు, ఆప్తులు ఎవ్వరూ లేకపోవడంతో పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. కాగా దహన సంస్కారాల నిర్వహణ ప్రశ్నగా మారింది. దీంతో విషయం తెలుసుకున్న ఆర్య వైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు ఐతా రత్నాకర్‌ సాయం చేశారు. దీంతో శ్రీరామకుంట శ్మశానవాటికలో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement