రోడ్డైనా వేయకపోవడం సిగ్గుచేటు
● కొల్లూరు–వెలిమెల రోడ్డు త్వరలో పూర్తి ● బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌రావు ధ్వజం
రామచంద్రాపురం(పటాన్‌చెరు): బీఆర్‌ఎస్ పార్టీ గత పదేళ్లుగా అధికారంలో ఉండి కూడా కొల్లూరు–వెలిమల సర్వీసు రోడ్డును కూడా పూర్తి చేయలేకపోవడం సిగ్గుచేటని ఎంపీ రఘనందన్‌రావు విమర్శించారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు– వెలిమెల మధ్య జరుగుతున్న ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..బీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, గత ఎంపీ ఈ మార్గంలో రాకపోకలు సాగించినా వారికి సర్వీస్ రోడ్డు సమస్య కనిపించకపోవడం దారుణమన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో స్థానికులు ఈ సమస్యను తన దృష్టికి తీసుకురాగా ఎంపీగా గెలిచిన వెంటనే వివిధ శాఖల అధికారులతో మాట్లాడి రూ.25కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, రైల్వేలైన్‌పై వంతెన నిర్మాణం, రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో దిశ కమిటీ సభ్యులు కాసాల సుధాకర్, డివిజన్ బీజేపీ అధ్యక్షులు రాంబాబుగౌడ్, మాజీ కౌన్సిలర్ రాజు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఎం.రాజేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, రవీందర్‌రెడ్డి, ప్రవీణ్, శంకర్‌చారి, సంతోశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


