మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ డీలా! | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ డీలా!

Feb 20 2026 11:03 AM | Updated on Feb 20 2026 11:03 AM

మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ డీలా!

మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ డీలా!

● నాయకత్వ లోపంతో ఓటమి ● ఫలితాలపై అధినాయకత్వం అసంతృప్తి ● కార్యకర్తల్లో వ్యక్తమవుతున్న నైరాశ్యం గుర్తింపులేని వారి వల్లే..

● నాయకత్వ లోపంతో ఓటమి ● ఫలితాలపై అధినాయకత్వం అసంతృప్తి ● కార్యకర్తల్లో వ్యక్తమవుతున్న నైరాశ్యం

ఆశించిన ఫలితాలు రాక నిరుత్సాహం

జహీరాబాద్‌: బీజేపీపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకునే విషయంలో నాయకత్వం పూర్తిగా విఫలమైందని కార్యకర్తల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జహీరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో కనీసం ఎనిమిది స్థానాలను దక్కించుకునే అవకాశం ఉన్నా మూడింటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల కేటాయింపుల నుంచి ప్రచారం వరకు కార్యకర్తల్లో జోష్‌ కనిపించలేదు. ప్రజల్లో కలిసిపోయే సత్తా ఉన్న నాయకులు లేకపోవడమే కారణమని కార్యకర్తలు అంగీకరిస్తున్నారు.

పలు వార్డుల్లో ప్రజల్లో ఏమాత్రం గుర్తింపులేని వారిని పోటీకి దింపడం కూడా ప్రతికూల ఫలితాలకు కారణం. కొన్ని వార్డుల్లో రెండంకెల ఓట్లు కూడా రాలేదు. గెలిచేందుకు అవకాశం ఉన్న వార్డుల్లో ముఖ్యనేతలు వ్యూహాత్మకంగా పనిచేస్తే సునాయసంగా విజయం సాధించి ఉండేందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు ఇలా వచ్చి అలా వెళ్లే నేతలకు బాధ్యతలు అప్పగించడం మరో కారణం. మొతం మీద పార్టీ నష్టమే ఎక్కువ మూటగట్టుకోవాల్సి వచ్చిందని బీజేపీ శ్రేణులు వాపోతున్నాయి. సాధించిన ఫలితాలపై అధినాయకత్వం సైతం అసంతృప్తితో ఉన్నట్లు పలువురు నాయకులు వ్యక్తం చేశారు.

వ్యూహం లేకనే..

మున్సిపల్‌ పరిధిలో 37 వార్డులు ఉన్నా కనీసం ఎనిమిది స్థానాల్లో గెలవాల్సి ఉందని, కానీ మూడు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం వ్యూహాత్మకంగా లేక పోవడమే ఓటమికి దారితీసిందని వాపోతున్నారు. 22వ వార్డులో గెలిచే అవకాశం ఉన్నా పార్టీ రెండో స్థానంలో నిలించింది. 41 ఓట్లతో ఓటమి పాలయింది. 24వ వార్డులో సైతం తక్కువ తేడాతో ఓటమి మూటగట్టుకుంది. 30వ వార్డులో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 31వ వార్డులోనూ కేవలం 60 ఓట్ల తేడాతో ఓడిపోయింది. 37వ వార్డులో స్వల్ప ఓట్లతో ఓటమి చెందింది.

అవకాశం లేకున్నా అంటకాగారు

చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు కావాల్సిన మెజార్టీ బీఆర్‌ఎస్‌ వద్ద లేకున్నా ముగ్గురు సభ్యుల బలం కలిగి ఉన్న బీజేపీ ఆ పార్టీకి అంటకాగడం కూడా పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపర్చింది. తటస్థంగా వ్యవహరించడమా లేక స్వతహాగా పావులు కదపడమా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని వ్యవహరించి ఉంటే పార్టీ పరువు దక్కేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వతంత్రంగా ముందుకు వెళ్తే పరువైనా మిగిలివుండేదంటున్నారు. మునిగిపోయే పడవలో ప్రయాణించడం కంటే స్వతంత్రంగా వ్యవహరించి ఉంటే పరువు దక్కటంతో పాటు ప్రతిష్ట కూడా పెరిగేదని కార్యకర్తలు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement