అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Feb 20 2026 11:03 AM | Updated on Feb 20 2026 11:03 AM

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

వెల్దుర్తి(తూప్రాన్‌): మండలంలోని శేరీల గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. బాధితులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండ బాలమణి, శ్రీనివాస్‌ దంపతులకు లింగం, నాగరాజులు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లింగంకు చిన్నశంకరంపేట మండలం శంకరాజ్‌ కొండాపూర్‌ గ్రామానికి చెందిన మల్లవ్వ, కిష్టయ్య దంపతుల రెండవ కూతురు మంజులతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. మొదట్లో సజావుగా కాపురం కొనసాగినా కొన్నేళ్లుగా భర్త లింగం, మరిది నాగరాజు, అత్త బాలమణిలు కలిసి దారుణంగా హింసించేవారు. ముగ్గురు కలిసి ఇష్టానురీతిగా దాడి చేయడంతో మూడు రోజుల క్రితం వెల్దుర్తిలోని చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కోమటిపల్లి కాలనీకి చెందిన పలువురు అడ్డుకొని సర్పంచ్‌ సమక్షంలో కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంట్లోని దూలానికి తన ఒంటిపై ఉన్న చీరతో ఉరేసుకొని శవమై కనిపించింది. భర్త, మరిది, అత్తమామలు ఉదయం దాడిచేసి హత్యచేశారని, అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ క్రమంలోనే అత్తింటి వారు వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. వివాహిత మృతికి కారకులైన వారిని తమకు అప్పగించడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించడం కుదరదని గ్రామస్తులు పట్టుపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెల్దుర్తి, శివంపేట, తూప్రాన్‌ ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బందితో పాటు స్పెషల్‌ టీం రంగంలోకి దిగింది. తూప్రాన్‌ సీఐ రంగా క్రిష్ణ గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి పోలీస్‌ బందోబస్తు మధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement