పొదుపు చేస్తేనే గృహజ్యోతి | - | Sakshi
Sakshi News home page

పొదుపు చేస్తేనే గృహజ్యోతి

Feb 19 2026 11:03 AM | Updated on Feb 19 2026 11:03 AM

పొదుపు చేస్తేనే గృహజ్యోతి

పొదుపు చేస్తేనే గృహజ్యోతి

● విద్యుత్‌ ఆదా చేస్తున్న గృహిణులు ● చలికాలంలో తగ్గిన విద్యుత్‌ వినియోగం ● వేసవిలో వినియోగం పెరిగే అవకాశం ● పొదుపుగా వాడుకోవాలని సూచన

● విద్యుత్‌ ఆదా చేస్తున్న గృహిణులు ● చలికాలంలో తగ్గిన విద్యుత్‌ వినియోగం ● వేసవిలో వినియోగం పెరిగే అవకాశం ● పొదుపుగా వాడుకోవాలని సూచన

సంగారెడ్డి జోన్‌: రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లలోపు వినియోగించిన వారికి మాత్రమే గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో చాలావరకు విద్యుత్తు పొదుపుగా వాడుకుని గృహజ్యోతిని సద్వినియోగం చేసుకున్నారు. అయితే కొద్దినెలలుగా పెరిగిన చలి తీవ్రతతో విద్యుత్‌ వినియోగం బాగా తగ్గిపోయింది. చాలా గృహాల్లో ఏసీ, ఫ్యాన్లు, కూలర్లు నడవకపోవడంతో విద్యుత్‌ వినియోగం తగ్గింది. అయితే రానున్న వేసవికాలంలో పథకం లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

వినియోగం తగ్గించే దిశగా

వేసవికాలం ప్రారంభంకాగా ఇప్పటికే ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడక తప్పనిపరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా విద్యుత్‌ వినియోగం పెరిగి గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య తగ్గుముఖం పట్టనుంది. అయితే గృహిణులు మాత్రం విద్యుత్‌ను పొదుపుగా వాడుకుని పథకం లబ్ధి పొందే దిశగా యోచిస్తున్నారు.

జిల్లాలో 67,915 గృహ కనెక్షన్లు

జిల్లాలో గృహ విద్యుత్‌ కనెక్షన్లు 67,915 ఉన్నాయి. గత నెలలో 200 యూనిట్లలోపు 2,16,669 మంది వినియోగించుకున్నారు. వీరందరికీ 6.43 కోట్ల రాయితీ లభించింది. విద్యుత్తును పొదుపుగా వినియోగించుకోవడంతో విద్యుత్తు ఉత్పత్తి భారం తగ్గుతుందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.

పొదుపు చేస్తేనే పథకం వర్తింపు

వేసవిలోనూ విద్యుత్‌ను ఆదా చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్లినప్పుడు వినియోగదారులకు సైతం అవగాహన కల్పిస్తున్నారు. అవసరం లేని సమయంలో విద్యుత్‌ సరఫరా బంద్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రామపంచాయతీలలో ఉండే వీధి దీపాలు ఆన్‌ ఆఫ్‌ స్విచ్‌లు సరైన విధంగా లేకపోవడం, నిర్వహణ చేపట్టకపోవడం తదితర కారణాలతో వెలుగుతూనే దర్శనమిస్తున్నాయి. ఓవైపు ప్రజలు ఆదా చేస్తుంటే మరోవైపు అధికారులే దుర్వినియోగం చేస్తున్నారని అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గృహ జ్యోతి పథకం లబ్ధిదారుల వివరాలు

నెల లబ్ధిదారులు సబ్సిడీ

(రూ.కోట్లలో)

అక్టోబర్‌ 2,12,138 రూ.8.05

నవంబర్‌ 2,11,177 రూ.7.79

డిసెంబర్‌ 2,16,773 రూ.6.61

జనవరి 2,16,669 రూ.6.43

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement