వ్యూహం లేక.. బీఆర్‌ఎస్‌ చతికిల | - | Sakshi
Sakshi News home page

వ్యూహం లేక.. బీఆర్‌ఎస్‌ చతికిల

Feb 19 2026 11:03 AM | Updated on Feb 19 2026 11:03 AM

వ్యూహం లేక.. బీఆర్‌ఎస్‌ చతికిల

వ్యూహం లేక.. బీఆర్‌ఎస్‌ చతికిల

● చివరి నిమిషంలో అభ్యర్థిత్వం మార్పు? ● జహీరాబాద్‌లో తక్కువ స్థానాల్లో గెలిచినా ఫలించిన కాంగ్రెస్‌ వ్యూహం

● చివరి నిమిషంలో అభ్యర్థిత్వం మార్పు? ● జహీరాబాద్‌లో తక్కువ స్థానాల్లో గెలిచినా ఫలించిన కాంగ్రెస్‌ వ్యూహం

జహీరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో తగిన వ్యూహం లేనందునే బీఆర్‌ఎస్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకోలేక చతికిలబడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జహీరాబాద్‌ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కంటే ఒక సీటు అధికంగా బీఆర్‌ఎస్‌ దక్కించుకున్నా అందుకు అనుగుణంగా వ్యూహరచన చేయడంలో పార్టీ నేతలు, శ్రేణులు విఫలమయ్యారనడానికి చైర్మన్‌ పదవిని కోల్పోవడమే నిదర్శనమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో హంగ్‌ వస్తుందని నిర్ధారించాయి. పలువురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందుతున్నారని, ఎంఐఎం, బీజేపీలు సైతం సీట్లను సాధిస్తున్నాయని సర్వేలు తేట తెల్లం చేస్తూ వచ్చాయి.

అప్రమత్తంగా లేకపోవడం వల్లే..

బీఆర్‌ఎస్‌ నేతలు అప్రమత్తంగా లేకపోవడం వల్లే జహీరాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని వారు కోల్పోవాల్సి వచ్చిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ముందు చూపుతో స్వతంత్రులుగా గెలుపొందే అభ్యర్థులకు ముందు నుంచే టచ్‌లో ఉండి, వారిని తమకు అనుకూలంగా మలుచుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పార్టీ శ్రేణులు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక్క ఓటు తాడాతో చైర్మన్‌ పదవిని కోల్పోవడం పార్టీ శ్రేణులను మనస్తాపానికి గురిచేసింది. పార్టీ నేతలే చేజేతులా చైర్మన్‌ పదవి ప్రత్యర్థులకు అప్పగించినట్లయిందని పార్టీ కార్యకర్తల వైపు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల కేటాయింపుల దగ్గరి నుంచి ప్రచారం వరకు అనేక తప్పిదాలు జరిగాయని, దీంతో మరిన్ని సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని కార్యకర్తలు మదన పడుతున్నారు.

ముస్లింల సంఖ్య అధికం

జహీరాబాద్‌ మున్సిపాలిటీలో ముస్లింల సంఖ్య అధికంగా ఉన్నందున రెండు పార్టీలు భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని వారి అభ్యర్థిత్వాలకే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రచారం సాగింది. బీఆర్‌ఎస్‌ వద్ద తగినంత సంఖ్యాబలం లేక పోవడంతో చైర్మన్‌ ఎన్నిక సమయంలో మారిన రాజకీయ పరిణామాలను పరిగణలోకి తీసుకుని చైర్మన్‌ పదవి అభ్యర్థిత్వానికి కాట స్రవంతి పేరును బీఆర్‌ఎస్‌ చివరి నిమిషంలో తెరపైకి తీసుకువచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అయినా సంఖ్యా బలం సమకూర్చుకోలేక పోయింది. ప్రస్తుతం మున్సిపల్‌ పరిధిలోనే కాకుండా జహీరాబాద్‌ నియోజకవర్గంలో ఇదే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది.

పార్టీ పరంగా సహాయం కరువు..

పలువురు అభ్యర్థులకు పార్టీ పరంగా ఆర్థిక సహాయం అందక పోవడం కూడా పలు వార్డుల్లో ఓటమికి దారితీసిందనే ప్రచారం సాగుతోంది. మున్సిపాలిటీలో 37 వార్డులు ఉండగా కాంగ్రెస్‌ పార్టీ 14 స్థానాలను మాత్రమే దక్కించుకుని చైర్మన్‌ పదవిని ఎగరేసుకు పోయింది. 15 స్థానాలు గెలుపొందిన బీఆర్‌ఎస్‌ మాత్రం మూడు స్థానాలు గెలుపొందిన బీజేపీతోనే సరిపెట్టుకుందంటున్నారు. ముగ్గురు స్వతంత్రులను, ఇద్దరు ఎంఐఎం సభ్యులను కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా, సమయస్పూర్తితో తనవైపు తిప్పుకోవడంలో సఫలీకృతం అయింది. జహీరాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పదవి బీసీ జనరల్‌ కేటగిరిలో రిజర్వు అయింది. అయినా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ముందస్తుగానే ముస్లిం మైనార్టీలకు చైర్మన్‌ పదవిని కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు ఆయా పార్టీ వర్గాల సమాచారం. అందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ పలువురు మైనార్టీల పేర్లను పరిశీలించినా చివరకు యూనూస్‌ పేరును ఖరారు చేసింది. బీఆర్‌ఎస్‌లో పలువురు మైనార్టీలు గెలుపొందినా మాజీ వైస్‌ చైర్మన్‌ ఎం.డి.తంజీం వైపే పార్టీ నేతలు మొగ్గుచూపినట్లు ప్రచారం సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement