చిరుధాన్యాల సాగుకు బోనస్
ఝరాసంగం(జహీరాబాద్): చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు ప్రభుత్వం బోనస్ కల్పించి ప్రోత్సహించేలా కృషి చేస్తామని, కమిషన్ తరఫున ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండారెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. నెల రోజులుగా డెక్కన్ డెవలప్‌మెంటు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 26వ పాత పంటల జాతర ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం మండల పరిధిలోని మాచ్నూర్ గ్రామ శివారులోని పచ్చసాలెలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కమిషన్ చైర్మన్‌తో పాటు సభ్యులు నర్సింహారెడ్డి, రామ్‌రెడ్డి గోపాల్‌రెడ్డి, రాములు నాయక్, గోపాల్, ఏడీఏ ఽసంధ్యారాణి తదితరులు హాజరయ్యారు. ముందుగా చిరుధాన్యాలతో అలంకరించిన ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. గిరిజన మహిళలతో కలిసి చైర్మన్, సభ్యులు నృత్యం చేశారు. అనంతరం జీవవైవిధ్య సంరక్షకులను సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ డీడీఎస్ ప్రయోగశాల లాంటిదని, శాస్త్రవేత్తలు సైతం వచ్చి సాగువిధానంపై అధ్యయనం చేయాలన్నారు. పాత పంటల సాగుకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. నాబార్డు అధికారులతో మాట్లాడి కోతులు, అడవి పందులు, జింకల బెడద నుంచి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమిషన్ సభ్యులు మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకంతో భూసారం నాశనం అవుతుందన్నారు. అదే విధంగా వాటితో సాగుచేసిన పంటలను ఆహారంగా తీసుకోవటం ద్వారా వ్యాధుల బారిన పడుతున్నారని వివరించారు.
మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి
చిరుధాన్యాలు సాగు చేస్తున్న తమకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని డీడీఎస్ డైరెక్టర్ దివ్య, రైతులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పాత పంటలు సాగు చేస్తున్నప్పటికీ తమకు గుర్తింపు లేదని వాపోయారు. రేషన్ దుకాణాలలో చిరుధాన్యాలు అందించాలని, అదే విధంగా కనీస మద్దతుధర కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మాధవి, డెరెక్టర్ సెంటర్ ఫర్ అగ్రో ఎకాలజీ ప్రొఫెసర్, ఏపీ వికాస కేంద్ర డైరెక్టర్ కిరణ్, జహీరాబాద్ ఏడీఓ భిక్షపతి పాల్గొన్నారు.
రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్
కోదండారెడ్డి
పాత పంటల జాతర ముగింపు
జీవవైవిద్య సంరక్షకులకు సన్మానం


