గంగ్వార్‌లో నాలుగిళ్లలో చోరీ
బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు
న్యాల్‌కల్(జహీరాబాద్): మండల పరిధిలోని గంగ్వార్ గ్రామంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. నాలుగిళ్లలో చోరీకి పాల్పడిన దుండగులు బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన చామల వీరారెడ్డి, వెంకట్‌రెడ్డి రెండు కుటుంబాలకు చెందిన వారు ఇళ్లకు తాళాలు వేసి హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఇళ్ల తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. వీరారెడ్డి ఇంట్లో 5మాసాల నల్ల పూసలతాడు, 4 మాసాల చేతి ఉంగరం, రూ.14,500 నగదు, వెంకట్‌రెడ్డి ఇంట్లో 7 మాసాల చెవుల కమ్మలు, రూ.15వేల నగదును ఎత్తుకెళ్లారు. అలాగే మాలవె వెంకట్, బోయిన లక్ష్మి ఇళ్లలో సైతం చోరీకి పాల్పడ్డారు. ఎలాంటి వస్తువులు ఎత్తుకెళ్లలేదని పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని రూరల్ సీఐ జెక్కుల హన్మంతు పరిశీలించారు. క్లూస్ టీం సిబ్బందితో ఆధారాలు సేకరించారు.


