పారదర్శకంగా పురపోరు
రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ శ్రీదేవి
సంగారెడ్డి జోన్/పటాన్‌చెరు: మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా ప్రతీ ఒక్కరు విధులు నిర్వర్తించాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ శ్రీదేవి పోలింగ్ ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణపై పట్టణంలోని ఐబీ గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్ ప్రావీణ్యతో బుధవారం సమీక్షించారు. అనంతరం పటాన్‌చెరులోని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. అధికారులు నిర్వహించాల్సిన విధులు, చేయాల్సిన ఏర్పాట్ల వంటి అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..విధుల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరు సమన్వయంతో, బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.


