బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒక్కటే
మంత్రి అజారుద్దీన్
నారాయణఖేడ్: రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒక్కటేనని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సోమవారం ఎంపీ సురేశ్‌షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి ఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం రాజీవ్‌చౌక్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాయని మండిపడ్డారు. అలాంటి ప్రచారాలను నమ్మవద్దన్నారు. ఖేడ్ మున్సిపాలిటీ, నియోజకవర్గ అభివృద్ధికి తన మంత్రిత్వ శాఖ ద్వారా కృషి చేయడంతో పాటు సీఎం దృష్టికి తీసుకెళ్లి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యే కాంగ్రెస్ వారే ఉండటంతో అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం, సభ్యులు శ్రీనివాస్, శంకరయ్యస్వామి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ ప్రణాళిక సంఘం మాజీ సభ్యులు నగేశ్ షెట్కార్, ముఖ్యనాయకులు రశీద్, తాహెర్‌అలీ, ముంతాజ్, అభ్యర్థులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం
జహీరాబాద్: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో వెనుకకు వెళ్లిందని జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జి, మంత్రి అజారుద్దీన్ అన్నారు. సోమవారం జహీరాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పేదలకు ఇళ్లు ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని, అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి తీరుతామన్నారు. జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగురడం ఖాయమన్నారు.


