ఏకగ్రీవమాయే.. ఓట్లు లేకపాయే!
● మధన పడుతున్న 32వ వార్డు ఓటర్లు ● ప్రచార సందడి కరువు ● పట్టణంలో ఈ వార్డు పైనే చర్చ..
మెదక్‌జోన్: మున్సిపాలిటీలో ఉన్నాం.. కానీ మనకు ఓట్లు లేకపాయే.. పట్టణంలోని అన్ని వార్డుల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నాయకులు ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎంతో కొంత ముట్టజెప్పుతుండ్రు, ప్రచారం చేస్తే కూలీ ఇస్తుండ్రు. కానీ మనల్ని పలకరించే వారు లేకుండా పోయారని పట్టణంలోని 32వ వార్డు ఓటర్లు ఆవేదన చెందుతున్నారు. కాగా వార్డు నుంచి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన గోదల మానస నామినేషన్ వేయగా, బీఆర్‌ఎస్ నుంచి మాజీ కౌన్సిలర్ గోదల జ్యోతి కృష్ణ నామినేషన్ వేశారు. ఈ నెల 1న జ్యోతి తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవటంతో ఆ వార్డు కౌన్సిలర్‌గా గోదల మానస ఏకగ్రీవంగా ఎన్నికై న విషయం తెలిసిందే. అయితే ఆ వార్డుకు ఎన్నికలు లేకపోవటంతో ఎలక్షన్లు లేవని ప్రజలు మదన పడుతున్నారు.
గతంలోనూ ఇలాగే...
గత మున్సిపల్ ఎన్నికల్లోనూ గోదల మానస, గోదల జ్యోతి నామినేషన్లు వేశారు. జ్యోతి విత్‌డ్రా చేసుకోవటంతో మానస ఏకగ్రీవంగా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. కాకుంటే అప్పట్లో మానస బీఆర్‌ఎస్ నుంచి, గోదల జ్యోతి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
పట్టణం అంతా వార్డుపైనే చర్చ!
ఇప్పటికి రెండు సార్లు ఎన్నికలు జరుగకుండా కౌన్సిలర్‌గా ఏకగ్రీవం కావటంతో పట్టణం అంతా ఈ వార్డు గురించే చర్చ జరుగుతుంది. వారి మధ్య ఏరకమైనా ఒప్పందం జరిగిందేమో కానీ భవిష్యత్తులో వారు నామినేషన్ వేసే వార్డుపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాన పార్టీల నేతలు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ముఖ్యంగా గోదల జ్యోతి కృష్ణ వరుసక్రమంగా నామినేషన్లు వేయటం, విత్‌డ్రా చేసుకోవటంపై అంతా చర్చించుకుంటున్నారు.


