మీవోడు గెలుస్తాడా? ఓడిపోతాడా?
సదాశివపేట(సంగారెడ్డి): హలో...మీ వార్డులో ఆ అభ్యర్థి పరిస్థితి ఏంటి? గెలుస్తాడా? ఓడిపోతాడా? ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు? అన్ని పార్టీలకంటే స్వంతత్ర అభ్యర్థే విజయం సాధిస్తాడా? ఇలా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయా మున్సిపాలిటీల్లోని ప్రధాన కూడళ్లు, హోటల్, టీ దుకాణాల్లో అభ్యర్థుల గెలుపోటములపై స్థానికులు చర్చోపచర్చలు కొనసాగిస్తున్నారు. ప్రచారం అయితే అందరూ బాగానే చేస్తున్నారు. జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లోని 256 వార్డుల్లో కూడళ్లు చాయ్ దుకాణాలు, మద్యం, కల్లు దుకాణాల్లోని సిట్టింగ్ రూముల్లో ఎక్కడ ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా ఇదే చర్చ జరుగుతోంది.
ఎవరికివారే రాజకీయ విశ్లేషకులు..
ఎవరికి వారు వార్డుల వారీగా పరిస్థితిని అంచనా వేస్తూ ఫలానా అభ్యర్థికే గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసేస్తున్నారు. అభివృద్ధి మాకేందుకు ఓటుకు డబ్బులిస్తేనే ఓటు వేస్తామని మెజార్టీ ఓటర్లు అంటుంటే మరికొందరు మాకు డబ్బులు వద్దు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసేవారికి ఓటు వేస్తామంటున్నారు. ఈసారి డబ్బు ప్రభావం చాలా పనిచేస్తుందని డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వారే గెలుస్తారని, ఇప్పటికే ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చేశారని తేల్చేస్తుండటం గమనార్హం. ఫలానా మతం ఓటర్లు ఎక్కువగా ఉన్నందువల్ల వారు ఎటువైపు మొగ్గుచూపితే వారికే విజయ అవకాశాలున్నాయని మరికొందరు తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే అన్ని చోట్లా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు సైతం జోరుగా ప్రచారం చేస్తుండటంతో గెలుపోటములపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.
ఒక్కొక్కరినీ కలుస్తూ..
పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు వ్యక్తిగత ప్రచారానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. వార్డులు వదిలి స్థానికంగానే మరోవార్డులో ఉంటున్న వారిని కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా వారితో గత అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతున్నారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ పీసీసీవర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, వారి కుమార్తె జయారెడ్డి వేర్వేరుగా ప్రతీరోజు వార్డుల్లో ముఖ్యులను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.
అభ్యర్థుల్లో గెలిచేదెవరో..
కూడళ్లు, టీ దుకాణాల్లో చర్చోపచర్చలు


