కొత్తగా నాలుగు పరిశ్రమలు: మంత్రి దామోదర
● కాంగ్రెస్‌ను గెలిపించండి ● జోగిపేటలో జోరుగా ఎన్నికల ప్రచారం
జోగిపేట(అందోల్): మహిళలు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు అందోలు మండలం పరిధిలోని సంగుపేట, మాసానిపల్లి ప్రాంతాల్లో నాలుగు కంపెనీలను ఏర్పాటు చేయిస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీనిచ్చారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని మున్సిపాలిటీలలో జోరుగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ..మహిళలకు వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు, మహిళలు స్వయంగా ఉపాధి పొందేందుకు కుట్టు మెషీన్లు మంజూరు చేయిస్తామని హామీనిచ్చారు. రజకులకు స్వయం ఉపాధి కోసం డ్రైక్లీనింగ్ సెంటర్ ఏర్పాటుకు రూ.6 లక్షలు ఇస్తానని ప్రకటించారు. నేపాల్ నుంచి వచ్చి ఇక్కడే పనిచేసుకుని జీవిస్తున్న కుటుంబాలకు అండగా ఉంటానని హామీనిచ్చారు. జోగిపేటలో మైనార్టీల కోసం రూ.3 కోట్లతో బహద్దూర్‌ఖాన్ ఫంక్షన్ హాలు నిర్మాణం చేపడతామని మంత్రి తెలిపారు. రాజరాజేశ్వర దేవాలయం మీదుగా బైపాస్‌రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రుల వైపు చూడకుండా గాంధీ, నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో మెరుగైన సేవలను పొందాలని సూచించారు. అందోల్–జోగిపేట మున్సిపాటీ పరిధిలోని 20 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కోరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ జి.మల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మాజీ కౌన్సిలర్లు ఆకుల చిట్టిబాబు ముదిరాజ్, సురేందర్‌గౌడ్, సురేశ్, డి.శంకర్‌లతోపాటు పలువురు పాల్గొన్నారు.


