పులి సంచారంపై పుకార్లు
మద్దూరు(హుస్నాబాద్): మండలంలో పులి సంచరిస్తున్నట్లు పుకార్లు వ్యాప్తి చెందడంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండలంలోని సలాఖపూర్ గ్రామ శివారు వ్యవసాయ భూములలో శుక్రవారం ఉదయం పెద్దపులి సంచరిస్తున్నట్టు గ్రామస్తుడు వేణు తెలిపాడు. అలాగే మద్దూరు–ముస్త్యాల గ్రామాల మధ్య పాత నర్సరీ ప్రాంతంలో పులిని చూసినట్టు ఓ మహిళల పోలీసులకు ఫోన్‌చేసి సమాచారం అందించింది. అలాగే లక్కపల్లిలో పులి సంచరించినట్టు ప్రజలు పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో చేర్యాల సీఐ రమేశ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఆసిఫ్, ఫారెస్టు బీట్ ఆఫీసర్ రాయుడు కలిసి సలాఖపూర్‌లో పులి పాదముద్రలను పరిశీలించారు. అయితే అవి పులి పాదముద్రలు కావని, హైనా పాదముద్రలుగా రాయుడు చెప్పారు. మండలంలో తిరుగుతున్నది పులి కాదని, ప్రజలు భయందోళనకు గురికావద్దని ఆయన కోరారు.


