గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగుల అరెస్టు
దుబ్బాకటౌన్: రామ్‌సాగర్ గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొగుట సీఐ షేక్ లతీఫ్ తెలిపారు. శుక్రవారం రాయపోల్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 3న రాత్రి వేళ రాంసాగర్ గ్రామస్తులైన శ్రీరాం సురేశ్, రాగి రాము కలిసి ప్రధాన కూడలిలో ఉన్న గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. శుక్రవారం రాయపోల్ ఎస్‌ఐ కుంచం మానస వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా నేరం ఒప్పుకున్నారు. దీంతో వారిని రిమాండ్‌కు తరలించామన్నారు.
పెద్దశంకరంపేట(మెదక్): గ్రామీణ ప్రాంతాల ప్రజలు తపాలశాఖ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి డివిజన్ తపాలాశాఖ సూపరింటెండెంట్ శ్రీహరి సూచించారు. పెద్దశంకరంపేట, నిజాంపేట్, రేగోడు మండలాల బీపీఎంతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీపీఎంలు లకా్‌ష్య్‌యలను సాధించాలన్నారు. తపాలాశాఖ అందిస్తున్న సేవల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ, ఎస్‌బీ, ఆర్‌డీ, ఇన్సూరెన్స్ పథకాలను సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాల గురించి వివరించాలని, నూతన పాలసీలు చేయించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్‌పీ బాషా, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటకమాన్: ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ వైద్య సిబ్బందికి సూచించారు. సిద్దిపేట అంబేడ్కర్‌నగర్, నాసర్‌పూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్‌ఓ శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా అర్హులైన పిల్లలకు వంద శాతం టీకాలు అందించాలన్నారు. మాతా శిశు ఆరోగ్య కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్‌యాదవ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రామాయంపేట(మెదక్): పట్టణ శివారులో జాతీయ రహదారిపై అక్రమంగా తరలుతున్న రేషన్ బియ్యం లారీని శుక్రవారం సాయంత్రం పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు పటాన్‌చెరువు నుంచి మహారాష్ట్ర వెళ్తున్న లారీని ఆపి తనిఖీలు నిర్వహించగా, రేషన్ బియ్యం అని తేలింది. ఈమేరకు లారీలో ఉన్న 320 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కొల్చారం(నర్సాపూర్): పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఐదుగురిని పట్టుకొని అరెస్ట్ చేశారు. ఈసంఘటన మండలంలోని రాంపూర్ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. రాంపూర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు ఎస్పీ ఆదేశాలతో మెదక్ టాస్క్‌ఫోర్స్ సీఐ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.18,600 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కొల్చారం పోలీస్‌స్టేషన్‌కు తరలించి అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ వారిలో బోలా శేఖర్, కథ శ్రీనివాస్, మస్కరి శ్రీశైలం, గుమ్మడి సురేష్, మ్యాకల యాదగిరి ఉన్నారు. జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో హెచ్చరించారు.
గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగుల అరెస్టు


