కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌పై చర్యలేవీ?
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
గజ్వేల్: బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో లూటీ చేసిన రూ. 2లక్షల కోట్ల ధనంలో వాటా పొందడం వల్లే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. శుక్రవారం రాత్రి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సొమ్మును బీఆర్‌ఎస్ మాదిరిగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం దోచుకుతింటున్నారని మండిపడ్డారు. ఈ–కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో బీఆర్‌ఎస్ నేతలను ఎందుకు జైలుకు పంపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలన గాడితప్పిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇష్టానుసారంగా హామీలను గుప్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు చేతులెత్తేశారని మండిపడ్డారు. మున్సిపాలిటీల అభివృద్ధి బీజేపీకే సాధ్యమని చెప్పారు.


