పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి
అదనపు కలెక్టర్ పాండు
జిన్నారం (పటాన్‌చెరు): ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పాండు పేర్కొన్నారు. జిన్నారం పట్టణ కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, సర్వీస్ ఓటర్లు సంబంధిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఘనంగా సమ్మక్క,
సారలమ్మల కల్యాణం
వట్‌పల్లి(అందోల్): మండల పరిధిలోని నాగులపల్లి గ్రామంలో శుక్రవారం సమ్మక్క సారలమ్మల కల్యాణం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా మొదటగా పంగా చెంద్రరెడ్డి ఇంటి నుంచి పడిగిద్ద రాజును, పెద్దపుల్ల నారాయణగౌడ్ ఇంటి నుంచి గోవిందరాజును డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా గద్దెల మీదకు తీసుకువచ్చారు. అనంతరం మేడారం నుంచి వచ్చిన ఒగ్గు కళాకారుల ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మలకు పడిగిద్దరాజు, గోవిందరాజులతో కల్యాణాన్ని జరిపించారు. ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని బంగారం(బెల్లం) తూకం వేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
పాతపంటలు..
భూసారానికి మేలు
గ్రంథాలయ సంస్థల జిల్లా చైర్మన్ అంజయ్య
రాయికోడ్ (అందోల్): పాత పంటల సాగు..భూసారానికి మేలని గ్రంథాలయ సంస్థల జిల్లా చైర్మన్ జి.అంజయ్య పేర్కొన్నారు. మండలంలోని నాగ్వార్ గ్రామంలో డీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం 26వ పాత పంటల జాతర నిర్వహించగా..వివిధ ధాన్యాలతో కూడిన ఎడ్ల బండ్ల ఊరేగింపు ఆయన ప్రారంభించారు. డప్పు చప్పుళ్లు, పాత పంటల ప్రాముఖ్యతను వివరిస్తూ గ్రామంలోని వివిధ వాడల్లో ఎడ్ల బండ్ల ఊరేగింపు కొనసాగించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అంజయ్య మాట్లాడుతూ..రసాయనాలు లేకుండా సహజ ఎరువులతో సాగు చేసే పాత పంటలు మానవ ఆరోగ్యభద్రతకు ఎంతో ఉపయోగంగా ఉంటాయన్నారు. రైతులు రసాయనాల వినియోగం తగ్గించి,పప్పు ధాన్యాలు, సంప్రదాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
ట్రెల్లిస్ విధానంతో
అధిక దిగుబడి: శాస్త్రవేత్త నిర్మల
హత్నూర(సంగారెడ్డి): ట్రెల్లిస్ విధానం వల్ల టమాటా పంటలో అధిక దిగుబడులు వస్తాయని ఉద్యానవన శాస్త్రవేత్త డా.ఏ.నిర్మల పేర్కొన్నారు. హత్నూర మండలం బడంపేట గ్రామంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం సంగారెడ్డి శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో టమాటా పంటపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన శుక్రవారం కల్పించారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ...ట్రెల్లిస్ విధానంలో టమాటాను సాగు చేయడం వల్ల మొక్కకు మంచిగాలి, సూర్యరశ్మి తగిలి తెగుళ్లు సోకవన్నారు. పండ్లు నేలకు తగలకుండా శుభ్రంగా, నాణ్యతగా, ఎక్కువ బరువుతో పెరుగుతాయని చెప్పారు. ఈ విధానం వల్ల రైతు బుచ్చిరెడ్డి తనకు లాభం వచ్చిందని తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి
పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి


