ప్రచారం.. ప్రసన్నం
మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు కుల, యువజన సంఘాలు, తటస్థ ఓట్లను తమవైపు మళ్లించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గంపగుత్తగా ఓట్లు దండుకుని గెలుపును నల్లేరు మీద నడక చేసుకునేందుకు అభ్యర్థులు శాయశక్తుల కృషి చేస్తున్నారు. ఆయా వర్గాలను కలిసి గంపగుత్తగా మీ ఓట్లన్నీ తమకే వేయాలని అడుగుతున్నారు. ఈ క్రమంలో వారి నుంచి ఎదురయ్యే డిమాండ్లను సావధానంగా వింటూ హామీలు గుప్పిస్తున్నారు. తటస్థ ఓటర్లను సైతంమచ్చిక చేసుకుంటున్నారు.
నారాయణఖేడ్:
జిల్లాలో 11 మున్సిపాలిటీల పరిధిలో 256 వార్డుల్లో 1,045మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పార్టీ గుర్తుపై ఈ ఎన్నికలు ఉండటంతో ఆయా వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థి ప్రభావం కూడా ఉంటుంది. దీంతో పార్టీతోపాటు అభ్యర్థి గుణగణాలను సైతం ఓటర్లు లెక్కిస్తుండటంతో అభ్యర్థులు తమ గెలుపుకోసం అన్ని వర్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక్క అవకాశం అంటూ..
తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవచేస్తానంటూ భరోసానిస్తున్నారు. ఆయా కాలనీల్లోని ఓటర్ల వివరాలు తీసుకుని వారి సమీప బంధువులతో ఫోన్లు చేయించి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డుల్లోని సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి హామీలు ఇస్తున్నారు. కొందరు అభ్యర్థులు కొన్ని హామీలను సొంత ఖర్చులతో నెరవేరుస్తూ ఓట్లన్నీ తనకే వేయాలంటూ కోరుతున్నారు. మిగతా హామీలు గెలిచాక చేస్తామంటూ భరోసా ఇస్తున్నారు. కార్మిక వర్గాలు ఉండే చోట వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
మహిళా ఓటర్ల కోసం
మహిళా ఓట్లు సైతం 50% వరకు ఉండటంతో వారి ఓట్లను పొందేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళలను ప్రచారానికి తీసుకెళుతూ వారికి బొట్లు పెడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో 3,41,785మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,70,628మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మెజార్టీ మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్ల సంఖ్యనే అధికంగా ఉండటంతో అభ్యర్థుల గెలుపోటముల్లో వీరు కీలక పాత్ర పోషించనున్నారు.
గంపగుత్త ఓట్ల కోసం..
కుల, యువజన సంఘాలతోఅభ్యర్థుల భేటీ
గెలుపుకోసం ముమ్మర యత్నాలు
హామీలు గుప్పిస్తూ ఎన్నికల ప్రచారం


