కాంగ్రెస్ ఒక్క హామీని నెరవేర్చలేదు
జహీరాబాద్: గత ఎన్నికల్లో సాధ్యం కాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఆయన ఓటర్లను కోరారు. జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 15, 28వ వార్డుల్లో గురువారం ఆయన పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను నేరుగా కలుసుకుని బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్ధతు ఇచ్చి గెలిపించాలని అభ్యర్థించారు. బీఆర్‌ఎస్ పాలనలోనే అనేక అభివృద్ధి పనులు జరిగాయని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్‌చార్జి దేవీప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, మాజీ ఎంపీటీసీ రజనీప్రియ, బీఆర్‌ఎస్ నాయకులు పద్మజ, శివకుమార్ పాల్గొన్నారు.


