ఆ రెండూ మోసకారి పార్టీలే
● బీజేపితోనే అభివృద్ధి సాధ్యం
● ఎంపీ రఘునందన్‌రావు
మెదక్ కలెక్టరేట్: పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్, మూడేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ రెండు మోసకారి పార్టీలేనని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. బుధవారం మెదక్ పట్టణంలోని పలు వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడుచోట్ల కార్నర్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు కారుపార్టీ అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. తండ్రి, బిడ్డ, కొడుకు, అల్లుడు వేలకోట్లు వెనకేసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో సంపాదించినది సరిపోక కవిత ఢిల్లీకి వెళ్లి అక్రమ మద్యం కేసులో జైలు పాలయ్యారని విమర్శించారు. హరీశ్‌రావు దోపిడీకి అడ్డే లేకుండా పోయిందని, జిల్లా ప్రజలకు ఈ విషయం బాగా తెలుసు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసిందేమి లేదని విమర్శించారు. కరోనా సమయంలో ఉచిత టీకాలతోపాటు ఉచిత బియ్యం అందించిన ఘనత మోదీకే దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయమన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, బక్కవారి శివ, ప్రతాప్, సుబాష్ చంద్రబోస్, నాయిని ప్రసాద్, రంజిత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


