పోష్ చట్టంతో వేధింపుల నుంచి రక్షణ
మహిళా శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి లలితకుమారి
నారాయణఖేడ్: పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపుల నుంచి రక్షణకు పోష్ యాక్ట్ ఎంతో కీలకమని మహిళా శిశు వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా అధికారి లలితకుమారి స్పష్టం చేశారు. ఖేడ్ మండలం జూకల్ శివారులోని కన్వెన్షన్ హాల్‌లో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం పోష్ యాక్ట్‌పై బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రతీ కార్యాలయంలో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు ఆవశ్యకత, లోకల్ కమిటీ పాత్ర, ఫిర్యాదు విధానం, మహిళలు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదుచేయడానికి ఉపయోగపడే షీ–బాక్స్ పోర్టల్ గురించి సమగ్రంగా వివరిస్తూ అవగాహన కల్పించారు. ఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, ఖేడ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కౌన్సిల్ నర్సింహారావు, సీడీపీఓ సుజాత, మహిళా సాధికారిత కేంద్రం జిల్లా సమన్వయకర్త పల్లవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భోజిరెడ్డి, స్థానిక ఎస్సై మొగులయ్య, షీటీమ్ ఎస్సై తులసీరాం తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న లలితకుమారి


