చేతులు కలిసేనా? | - | Sakshi
Sakshi News home page

చేతులు కలిసేనా?

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

చేతుల

చేతులు కలిసేనా?

సమన్వయమే ప్రశ్నార్థకం 8 బల్దియాల్లో రెండు, మూడు గ్రూపులుగా కాంగ్రెస్‌ పార్టీ తెరపైకి అంతర్గత ఆధిపత్య పోరు

మున్సిపల్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లోని అంతర్గత విభేదాల అంశం తెరపైకి వస్తోంది. పలు నియోజకవర్గాలోని మున్సిపాలిటీల్లో రెండు, మూడు గ్రూపులుగా విడిపోయిన ఆ పార్టీ నాయకత్వం, శ్రేణులు ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంతమేరకు సమన్వయంతో పనిచేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : డీసీసీ అధ్యక్ష ఎన్నిక నాటి నుంచి..కౌన్సిలర్‌ టికెట్ల కేటాయింపుల వరకు ఆ పార్టీలోని నేతల మధ్య అంతర్గత ఆధిపత్యపోరు తరచూ రచ్చకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల్లోని హస్తం పార్టీ పరిస్థితులను పరిశీలిస్తే..

‘ఖేడ్‌’ బల్దియాలో పట్టుకోసం..

ఖేడ్‌లో ఎంపీ షెట్కార్‌కు మంచి పట్టుంది. ఈ ఎన్నికల్లో తన అనుచరులు నలుగురికి టికెట్లు ఇప్పించుకున్న స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి కూడా ఇక్కడ పట్టుకోసం ప్రయత్నాలు చేస్తుండటం ఆసక్తికరంగా పరిణమించింది. గత అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల మాదిరిగానే సమన్వయంతో ఇప్పుడు పనిచేస్తారా? లేదా? అనేది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ మున్సిపాలిటీలో కొన్ని టికెట్ల పంచాయితీ ఇటీవల ఏకంగా గాంధీభవన్‌కు చేరిన విషయం తెలిసిందే. మున్సిపల్‌ ఎన్నికల కోసం నియమించిన మంత్రి అజహారుద్దీన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ సమక్షంలో ఇద్దరి మధ్య టికెట్ల సయోధ్య కుదిర్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మూడో వర్గంతో సమన్వయమేదీ?

టాన్‌చెరు నియోజకవర్గంలో ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్‌, మెదక్‌ పార్లమెంట్‌ స్థానం ఇన్‌చార్జి నీలం మధుముదిరాజ్‌ ఈ ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని అభ్యర్థుల ఎంపిక సందర్భంగా బహిరంగంగా ప్రకటించారు. ఇస్నాపూర్‌, ఇంద్రేశం మున్సి పాలిటీలో నీలంమధు, జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో శ్రీనివాస్‌ దృష్టిపెట్టారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉప్పు..నిప్పు..అన్నట్లు రచ్చకెక్కిన ఈ రెండు వర్గాలు ఈ బల్దియా ఎన్ని కల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ నేతల మధ్య సమన్వయం క్షేత్రస్థాయిలో ఎన్నికల చివరివరకు కొనసాగుతుందా లేదా అనేది కొన్ని రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. మరో వైపు ఇక్కడ మూడో వర్గం టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్‌కుమార్‌ వర్గంతో ఈ రెండు వర్గాలు సమన్వయం చేసుకున్న దాఖలాలు కనిపించడం లే దని రాజకీయవర్గాల అభిప్రాయం పడుతున్నాయి.

టికెట్లలో సయోధ్య సరే

జహీరాబాద్‌, కోహీర్‌ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ మార్కు రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంపీ షెట్కార్‌, మాజీమంత్రి చంద్రశేఖర్‌, సెట్విన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గిరిధర్‌రెడ్డి వర్గాల మధ్య టికెట్ల లొల్లి ఏకంగా గాంధీభవన్‌లోనే సెటిల్‌ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. రెండు మున్సిపాలిటీల్లో ఈ మూడు వర్గాల నాయకులు క్షేత్రస్థాయిలో ఎంత సమన్వయంతో పనిచేసి హస్తం పార్టీ అభ్యర్థులను గెలుపు తీరాలకు చేరుస్తారనేది ఫలితాలను బట్టి తేలనుంది.

అందోల్‌, సంగారెడ్డి, సదాశివపేట బల్దియాల్లో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డిలకు నియోజకవర్గాల్లో ఎదురులేకపోవడంతో ఇక్కడ అంతర్గతంగా నెలకొన్న విభేదాలు ఇంకా రచ్చకెక్కడం లేదు. మొత్తం మీద హస్తం పార్టీలోని అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో జరుగుతున్న ఈ బల్దియా ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్ని మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేస్తుందనేది తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

అందోల్‌, సంగారెడ్డిల్లో..

చేతులు కలిసేనా? 1
1/1

చేతులు కలిసేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement