అందరికీ సమాన హక్కులు అవకాశాలు
అదనపు కలెక్టర్ మాధురి
సంగారెడ్డి జోన్: సమాజంలోని ప్రతీ ఒక్కరికి సమాన హక్కులు అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఫిబ్రవరి 4న తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ మాధురి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా పూలె, అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ..సామాజిక న్యాయం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతీ ఒక్కరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళలు, దివ్యాంగుల అభ్యున్నతికి అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జగదీశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విశాలాక్ష్మి, ఇతర జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


