భూసార ఫలితాల మేరకే ఎరువులు
చిన్నశంకరంపేట(మెదక్): భూసార పరీక్షల ఫలితాల మేరకు రైతులు పొలాల్లో ఎరువులు వాడాలని రామాయంపేట ఏడీఏ రాజ్‌నారాయణ సూచించారు. మంగళవారం నార్సింగి రైతువేదికలో మండలంలోని రైతులకు భూసార పరీక్షల కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భూసార పరీక్షలతో వ్యవసాయ భూమిలో ఉన్న పోషకాల గురించి తెలుసుకుని అవసరమైన వాటిని వాడుకోవాలన్నారు. అవసరమైన ఎరువులు వాడటం ద్వారా ఖర్చులు తగ్గించుకోవచ్చని తెలిపారు. చౌడు భూములకు ఎకరానికి 2 క్వింటాళ్ల జిప్సం వాడితే చౌడు తగ్గి పంట ఎదుగుదల పెరుగుతుందన్నారు. ఆయిల్‌ఫామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, లాభాల గురించి హర్టికల్చర్ జిల్లా అధికారి ప్రతాప్‌సింగ్ వివరించారు. ఈ కార్యక్రమంలో నార్సింగి ఏఓ భరత్‌కుమార్, ఏఈఓ విజృంభణ, మంజీరా ఎఫ్‌పీసీ చైర్మన్ నర్సింహారెడ్డి పాల్గొతన్నారు.


