చిన్నారిని చిదిమేసిన వాహనం
గజ్వేల్‌రూరల్: అజాగ్రత్తగా వచ్చిన గుర్తు తెలియని వాహనం చిన్నారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందగా, తండ్రితో పాటు కొడుకుకు గాయాలయ్యాయి. ఈ ఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన చిన్నబోయిన స్వామి తన ద్విచక్ర వాహనంపై కొడుకు శ్రీహర్ష, కూతురు సాహితి(7)లతో కలిసి మంగళవారం లింగరాజ్‌పేటలోగల అత్తగారింటికి వస్తున్నాడు. ఈ క్రమంలో రాజీవ్ రహదారి నుంచి లింగరాజ్‌పేటకు వచ్చే మార్గంలో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాహితీ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, కొడుకు శ్రీహర్ష, తండ్రి స్వామికి గాయా లయ్యాయి. వెంటనే గాయాలైన వారిని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటి వరకు నవ్వుతూ తనతోపాటే ద్విచక్ర వాహనంపై వచ్చిన కూతురు కళ్లేదుటే మృతి చెందడంతో ఆ తండ్రి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
పాల వ్యాన్ ఢీకొని..
హుస్నాబాద్: వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా... పట్టణంలోని 10వ వార్డు జ్యోతినగర్‌కు చెందిన పోగుల యాదగిరి (62) పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న దుకాణ సముదాయంలో చిన్న హోటల్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఉదయం ఇంటి నుంచి సైకిల్‌పై హోటల్‌కు వస్తున్నాడు. మున్సిపల్ కార్యాలయం వద్ద వెనుక నుంచి వచ్చిన పాల వ్యాన్ ఢీకొని యాదగిరి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
క్రేన్ ఢీకొని వృద్ధురాలు..
కంది(సంగారెడ్డి): రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని క్రేన్ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం... మండల కేంద్రంలోని లక్ష్మీనగర్లో నివాసముంటున్న ఎగువే లక్ష్మీబాయి(72) మంగళవారం ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలో శంకర్పల్లి వైపు వెళ్తున్న క్రేన్ వాహనం లక్ష్మీబాయిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా క్రేన్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి..
జహీరాబాద్ టౌన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మండలంలోని కాశీపూర్ గ్రామానికి చెందిన తుకారం మోటారు బైక్‌పై మొగుడంపల్లి మండలంలోని గొపన్‌పల్లి గ్రామానికి వెళ్లాడు. సోమవారం రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. బలమైన గాయాలైన అతడ్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో..
కల్హేర్(నారాయణఖేడ్): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాలు... మండల కేంద్రానికి చెందిన వడ్ల సత్యం(52) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఓల్డ్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద కల్వర్టు పక్కన సత్యం శవమై కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ నారాయణ తెలిపారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో
నలుగురు మృతి
చిన్నారిని చిదిమేసిన వాహనం


