సైక్లింగ్‌లో పతకాల వేట
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం (ఓఏ)చదువుతున్న బరిగె కావ్య సైక్లింగ్ పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో సత్తా చాటుతోంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె పట్టుదలతో ముందుకు సాగుతూ క్రీడాభిమానులకు ఆదర్శంగా నిలుస్తుంది. పట్టణానికి చెందిన బరిగె కనకయ్య, రేణుకల కూతురు కావ్య 10వ తరగతి వరకు పట్టణంలోని పారుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివింది. తండ్రి మేసీ్త్ర పనిచేస్తూ ఆరోగ్యం బాగాలేక ఐదేళ్ల క్రితం మరణించాడు. తల్లి కూలి పనిచేస్తుండగా ఇద్దరు అన్నయ్యలు పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. కావ్యకు చిన్నతనం నుంచే క్రీడలపై మక్కువ ఎక్కువ. రెండు సంవత్సరాల క్రితం సీనియర్స్ ఆమెను సైక్లింగ్‌లో పాల్గొనాలని సూచించారు.
అభినందించిన అధ్యాపకులు
కళాశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, చిన్నకోడూరు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు, దేవయ్య, సుధాకర్‌రెడ్డి, కనకచంద్రం, శ్రీనివాస్‌రెడ్డి, నగేశ్, రఘురాజ్, కోచ్ వెంకటేశ్ తదితరులు కావ్య పట్టుదల, కృషిని అభినందించారు. ఈ సందర్భంగా సత్కరించి, అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి మెడల్స్ సాధించాలని, చదువులో సైతం ముందుండాలని సూచించారు.
జాతీయ స్థాయిలో..
సుమారు రెండేళ్లుగా పట్టుదలతో సాధన చేస్తూ సిద్దిపేట రంగనాయక సాగర్‌పై జరిగిన సీఎం కప్ పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించింది. హైదరాబాద్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్ –17 విభాగంలో రాష్ట్ర స్థాయిలో సిల్వర్ మెడల్, జనవరి 2025లో పాట్నాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని భేష్ అనిపించుకుంది. జిల్లా, రాష్ట్ర తదితర పోటీల్లో పాల్గొన్న ఆమె ఇప్పటివరకు 10 మెడల్స్ సాధించింది. ఆమె ప్రతిభను గుర్తించి ఖేలో ఇండియా అకాడమీలో కోచ్ సంజీవ్ శిక్షణ అందిస్తున్నాడు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సహకారంతో జావా 12 స్పీడ్ కార్బన్ సైకిల్ అందించడంతో సైక్లింగ్‌లో మరింత ముందుకు సాగుతుంది. ఇటీవల చౌటుప్పల్‌లో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మాస్టర్ విభాగంలో గోల్డ్‌మెడల్, టైమ్‌ట్రావెల్ విభాగంలో సిల్వర్ మెడల్స్ సాధించింది. ఈ నెల 15న ఒడిశాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననుంది.
కష్టపడి సాధన చేస్తా
చిన్నతనం నుంచి క్రీడలంటే ఎంతో ఇష్టం. సిద్దిపేటలో ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంకా బాగా కష్టపడి సాధన చేస్తా... జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తా. భవిష్యత్‌లో రైల్వేలో ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడుతా. దాతలు సహకరిస్తే మరిన్ని మెడల్స్ సాధించి సిద్దిపేటకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకువస్తాను. – బరిగె కావ్య
పోటీల్లో రాణిస్తున్న సిద్దిపేట ఆణిముత్యం
విజయానికి పేదరికం అడ్డు కాదు
రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో
రాణిస్తున్న కావ్య
సైక్లింగ్‌లో పతకాల వేట


