
తాళం వేసిన ఇంట్లో చోరీ
పటాన్‌చెరు టౌన్ : తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడు శివకుమార్ కథనం ప్రకారం... అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ సాయి కాలనీకి చెందిన శివకుమార్ ఈ నెల 18వ తేదీన సదాశివపేట్‌లో ఉండే బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంటి యజమాని శ్రీనివాస్ ఫోన్ చేసి మీ ఇంటి తాళం పగలగొట్టి ఉందని అతడికి సమాచారం ఇచ్చారు. ఇంటికి వచ్చిన అతడు ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. గుర్తు తెలియని దండుగులు ఐదు తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పశువుల
అక్రమ రవాణా అడ్డగింత
కొండపాక(గజ్వేల్): ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా పశువులను తరలిస్తున్న దుద్దెడకు చెందిన పలువురిని అడ్డగించి పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం సిద్దిపేట నుంచి కొండపాక వైపు బొలెరో వాహనంలో 9 ఆవులు, ఒక లేగను ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తుండగా మురళి అనే వ్యక్తి గమనించి హిందూవాహిని సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు తెలిపారు. దీంతో త్రీటౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని దుద్దెడ టోల్‌గేట్ వద్ద వాహనాన్ని అడ్డగించి డ్రైవర్‌ను విచారించారు. నల్లగొండ సంత నుంచి హైద్రాబాద్‌లోని మూసాపేట్‌కు తరలిస్తున్నట్లు డ్రైవర్ తెలిపాడు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని తేలడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
ట్రావెల్ బస్సుకు
తప్పిన ప్రమాదం
తూప్రాన్: ట్రావెల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివానందం, ప్రయాణికుల కథనం ప్రకారం... పట్టణ సమీపంలోని నాగులపల్లి చౌరస్తా సమీపంలోని హల్దీవాగు వద్ద రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విశ్వకర్మ ట్రావెల్స్ బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. తూప్రాన్ పట్టణ సమీపంలోని హల్దీవాగు వద్దకు చేరుకోగానే బస్సు ముందు చక్రాలు ఊడిపోయి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రయాణికుల్లో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పోలీసులు కేసు నమేదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బస్సును ఢీకొట్టిన కారు
– పలువురికి స్వల్ప గాయాలు
నర్సాపూర్ రూరల్: కారు ముందు టైర్ పేలి అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ఈ ఘటన నర్సాపూర్ – మెదక్ జాతీయ రహదారిపై రెడ్డిపల్లి సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... ఇద్దరు భక్తులు ఏడుపాయల వనదుర్గామాతను దర్శనం చేసుకొని కారులో నర్సాపూర్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో రెడ్డిపల్లి సమీపంలో కారు ముందు టైరు పేలి అదుపు తప్పడంతో మెదక్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు, కారులో ఉన్న ఇద్దరు భక్తులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ స్వామి సమన్వయంతో బస్సును అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న భక్తుల వివరాలు తెలియ రాలేదు.
బస్సు కిందపడి వ్యక్తి మృతి
పటాన్‌చెరు టౌన్ : బస్సు ఎక్కుతున్న క్రమంలో ఓ వ్యక్తి కింద పడగా అతడి కుడి కాలు పై నుంచి బస్సు వెనుక టైర్ వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్సకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాన్ మొహమ్మద్ (40) బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం వచ్చి పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని కటిక బస్తీలో నివాసం ఉంటూ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సంగారెడ్డిలో ఉన్న లారీని తీసుకువచ్చేందుకు బస్టాండ్‌లో పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎక్కుతున్న క్రమంలో కింద పడ్డాడు. దీంతో అతడి కుడికాలుపై నుంచి బస్సు వెనుక టైర్ వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స కోసం 108 వాహనంలో పటాన్‌చెరు, సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారంగానే తన భర్త మృతి చెందాడని మృతుడి భార్య ఫుల్జాహ బేగం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.