
భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య
జిన్నారం (పటాన్‌చెరు): భార్యాభర్తల మధ్య గొడవలతో విసుగు చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహేశ్వర్ రెడ్డి కథనం ప్రకారం... గుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన బీర్ల నాగరాజు (30) కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అనితతో 15 నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్ద మనుషులు కలగజేసుకొని నచ్చచెప్పారు. కాగా మరోసారి గొడవ జరగడంతో భార్య అనిత పుట్టింటికి వెళ్లింది. మళ్లీ తల్లిదండ్రులు నచ్చచెప్పి భర్త వద్దకు పంపించారు. అలా వచ్చిన భార్య మెడలో నగలు లేకపోవడంతో నాగ రాజు నగలు తీసుకురావా లని భార్యను పంపించాడు. ఈ నెల నాగరాజు బయటకు వెళ్తుండగా అతడి తల్లి ఎక్కడికి వెళ్తున్నావని అడిగింది. ఊర్లోకి వెళ్లి వస్తానని తిరిగి రాలేదు. ఆదివారం గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి వ్యవసాయ పొలంలో నాగరాజు వేపచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తితోనే తన కొడుకు అత్మహత్యకు పాల్పడ్డాడని తల్లి సాలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.