మక్కల ట్రాక్టర్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

మక్కల ట్రాక్టర్‌ బోల్తా

Apr 13 2025 7:55 AM | Updated on Apr 13 2025 7:55 AM

మక్కల

మక్కల ట్రాక్టర్‌ బోల్తా

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): మక్కల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటన మండలంలోని బస్వపూర్‌ గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగసముద్రాల గ్రామానికి చెందిన చింతలపల్లి జనార్దన్‌ అనే రైతు మక్కల లోడ్‌తో సిద్దిపేటకు వెళ్తున్నాడు. బస్వపూర్‌ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రైతుకు ఎలాంటి గాయాలు కాలేదు. మక్కలు రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడ్డాయి.

దొంగతనం కేసులో

ఇద్దరు రిమాండ్‌

వర్గల్‌(గజ్వేల్‌): దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను శనివారం కోర్టులో రిమాండ్‌ చేసినట్లు గజ్వేల్‌ రూరల్‌ సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని సహస్రనగర్‌కు చెందిన వేముల చంద్రప్రకాశ్‌ అలియాస్‌ చందు(27), రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన గాజుల హేమంత్‌(19) గతంలో దొంగతనం కేసుల్లో అరెస్టయ్యారు. కరీంనగర్‌ జైలులో వీరికి పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని 10న గురువారం వర్గల్‌ మండలం గౌరారం చేరుకున్నారు. అర్థరాత్రి వేళ పాములపర్తి చౌరస్తా వద్ద ఉన్న పూదరి శ్రీనివాస్‌గౌడ్‌ కిరాణషాపు షట్టర్‌ను పైకిలేపి మూడు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి రూ.5,000 నగదు ఎత్తుకెళ్లారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దొంగతనానికి పాల్పడిన నిందితుల నుంచి రూ.800 నగదు, ఇనుప రాడ్‌ స్వాధీనం చేసుకొని శనివారం గజ్వేల్‌ కోర్టులో రిమాండ్‌ చేశామని సీఐ పేర్కొన్నారు.

బాలుడిపై కుక్కల దాడి

నర్సాపూర్‌: బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన నర్సాపూర్‌ మున్సిపాలిటీ పరిధి లోని హన్మంతాపూర్‌లో శనివారం ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హన్మంతాపూర్‌కు చెందిన స్వప్న, రాజు దంపతుల ఐదేళ్ల కుమారుడు ఉద్బవ్‌ ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు. నాలుగైదు కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. వార్డులో వీధి కుక్కల బెడద బాగా పెరిగిందని, వాటిని అదుపు చేయాలని కోరారు.

అప్పుల బాధతో

ఉరేసుకొని ఆత్మహత్య

ములుగు(గజ్వేల్‌): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ములుగు మండలం జప్తిసింగాయిపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కథనం మేరకు.. గ్రామానికి చెందిన నీలం శ్రీవర్దన్‌రెడ్డి(34) ఇంటి వద్దనే ఉంటూ చెడు వ్యసనాల బారిన పడ్డాడు. కొంత మేరకు అప్పులయ్యాయి. అప్పులు తీర్చలేక తరచూ బాధపడుతుండేవాడు. దీంతో మనస్తాపానికి గురై ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి బాగిరెడ్డి ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

విద్యుదాఘాతంతో

యువ రైతు మృతి

పుల్‌కల్‌(అందోల్‌): విద్యుదాఘాతంతో యువ రైతు మృతి చెందాడు. పుల్‌కల్‌ మండల పరిధిలోని మిన్‌పూర్‌ తండాలో చోటు చేసుకుంది. పుల్‌కల్‌ ఎస్‌ఐ క్రాంతికుమార్‌ కథనం మేరకు.. మిన్‌పూర్‌ తండాకు చెందిన రమావత్‌ రమేశ్‌ (32) నీళ్లు పారించడానికి శుక్రవారం రాత్రి పొలం వద్దకు వెళ్లాడు. అంత కు రెండు రోజుల ముందు.. గాలి వానకు విద్యుత్‌ తీగ తెగి కింద పడి పడింది. ఇది గమనించని రమేశ్‌ పొలం నుంచి అలాగే వెళ్తుండగా.. కాలికి తీగ తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి అయినా రమేశ్‌ ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో శనివారం ఉదయం మరోసారి వెతుకుతుండగా పొలంలోనే చనిపోయి కనిపించాడు. మృతుని భార్య రమావత్‌ లత ఫిర్యాదు మేరకు పుల్‌కల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

మక్కల ట్రాక్టర్‌ బోల్తా  1
1/2

మక్కల ట్రాక్టర్‌ బోల్తా

మక్కల ట్రాక్టర్‌ బోల్తా  2
2/2

మక్కల ట్రాక్టర్‌ బోల్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement