సీతారామ కల్యాణానికి మంత్రి దామోదరకు ఆహ్వానం
జోగిపేట(అందోల్): జోగిపేటలోని శ్రీపబ్బతి హనుమాన్ దేవాలయంలో ఈనెల 6న జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి హాజరు కావాలని మంత్రి దామోదర రాజనర్సింహను ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ మేరకు సంగారెడ్డిలోని మంత్రి నివాసంలో శుక్రవారం దామోదరను కలసి ఆహ్వాన పత్రిక ను అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో జోగిపేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ ఎ.చిట్టిబాబు, ఆలయ పూజారి లక్ష్మణాచారి, ఆత్మకమిటీ సభ్యుడు చిట్యాల మధు, యువజన కాంగ్రెస్ నాయకుడు డాకూరి రఘునాథ్ ఉన్నారు.
నూకలు లేకుండా
పంపిణీ చేయాలి
ఎమ్మెల్యే సునీతారెడ్డి
హత్నూర (సంగారెడ్డి): పేదలకు నూకలు లేకుండా సన్న బియ్యం పంపిణీ చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. హత్నూర మండలం దేవులపల్లి గ్రామంలో శుక్రవారం రేషన్ దుకాణంలో సన్నబియ్యాన్ని ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సన్నబియ్యం పేరుతో నూకలు పంపిణీ చేయొద్దని దీనివల్ల లబ్ధిదారులకు నష్టమే తప్ప లాభం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫొటోలకు తప్ప ప్రచారం తప్ప క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే అధికారులను అప్రమత్తం చేసి పేదలకు నాణ్యమైన సన్నబియాన్ని అందించాలని డిమాండ్ చేశారు.
ఐలా అభివృద్ధికి
సంపూర్ణ సహకారం
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు: పటాన్‌చెరు పారిశ్రామికవాడ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. పటాన్‌చెరు ఐలా నూతన కార్యవర్గం కమిటీ సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ...ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్‌చెరు నియోజకవర్గంలో పరిశ్రమల యాజమాన్యాలకు ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. పారిశ్రామికవాడల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. నూతన పరిశ్రమల ఏర్పాటుకు యాజమాన్యాలు ముందుకు రావాలని కోరారు. స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
పోషకాహారలోపం
నిర్మూలనకు కృషి
సంగారెడ్డిజోన్: జిల్లాలో పోషకాహార లోపాన్ని నిర్మూలించేందుకు అందరి సమన్వయంతో కృషి చేస్తామని జిల్లా సంక్షేమాధికారి లలితకుమారి పేర్కొన్నారు. హైదారాబద్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితారామచంద్రన్ శుక్రవారం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న లలితకుమారి మాట్లాడుతూ...పోషకాహారం తగ్గించడంపై జిల్లా, గ్రామస్థాయిలో ప్రతీ ఒక్కరు బాధ్యత వహించాలన్నారు.
శ్రీరామనవమి
ప్రశాంతంగా జరుపుకోవాలి
శాంతి సమావేశం నిర్వహించిన డీఎస్పీ
సంగారెడ్డి క్రైమ్: శ్రీరామనవమి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ సత్తయ్య గౌడ్ సూచించారు. సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన శాంతి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని యువకులంతా కులం, మత భేదం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని తెలిపారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో ఎవరికీ ఇబ్బంది కలిగించొద్దని పట్టణ సీఐ రమేశ్ సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూవాహిని సభ్యులు, ఇస్లామిక్ సభ్యులతో పాటు ఇతరులు పాల్గొన్నారు.
సీతారామ కల్యాణానికి మంత్రి దామోదరకు ఆహ్వానం


