విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
మనోహరాబాద్(తూప్రాన్): విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి చెందిన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్ కథనం మేరకు.. మధ్యప్రదేశ్ రాష్ట్రం బేలియా గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్ (21) మనోహరాబాద్ మండలం కొండాపూర్ శివారులోని శ్రీయాన్ పాలిమర్స్ పరిశ్రమలో కూలీగా పని చేస్తున్నాడు. మంగళవారం పరిశ్రమలో కూలర్‌ను సరిచేస్తున్న క్రమంలో ఇనుప స్టాండ్ వేసుకొని ఇంజక్షన్ మోల్డ్ మిషన్‌ను పరిశీలిస్తున్నాడు. స్టాండ్‌కు విద్యుత్ వైర్లు తగిలి షాక్ కొట్టడంతో పడిపోయాడు. ఇది గమనించిన తోటి కార్మికులు మేడ్చల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పరిశ్రమలో సరైన వసతులు లేకనే మృతి చెందాడని తోటి కార్మికులు పరిశ్రమ వద్ద నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఘటనా స్థలానికి వచ్చి కార్మికులతో మాట్లాడి సముదాయించాడు. మృతుడి అన్న దినేశ్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


