సెంట్రల్ క్రైం బ్రాంచ్ డీసీపీ శ్వేత
కొండపాక(గజ్వేల్): సత్యసాయి సంజీవని ఆసుపత్రి దేవాలయం లాంటిదని సెంట్రల్ క్రైం బ్రాంచ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలోని సత్యసాయి సంజీవని హార్ట్ కేర్ సెంటర్‌ను ఆదివారం ఆమె సందర్శించారు. ఆపరేషన్లు చేయించుకున్న చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ చాక్లెట్స్, గిప్టులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సత్యసాయి ఆసుపత్రి కార్పోరేట్ ఆసుపత్రులను తలదన్నేలా పుట్టిన పసి బిడ్డ నుంచి 18 ఏళ్ళ లోపు వారందరికి రూపాయి ఖర్చు లేకుండా గుండె ఆపరేషన్లు చేయడం గొప్ప విషయమన్నారు. చిన్నారుల గుండె ఆపరేషన్లు జరుగుతున్నంత సేపు తల్లిదండ్రులు పడిన బాధను చెబుతుండటాన్ని చూసి చలించిపోయానన్నారు. ఆసుపత్రి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్టు చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆసుపత్రిలో నవంబరు నుంచి మార్చి వరకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు 83 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు విజయవంతం చేశామన్నారు. అనంతరం ఆపరేషన్లు పూర్తయిన చిన్నారులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వహణ ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.