● అవగాహన కల్పిస్తున్న అధికారులు
● వర్షపు నీరు వృథా కాకుండా చర్యలు
సంగారెడ్డి జోన్: వర్షపు నీరు వృథా పోకుండా సంరక్షించుకునేందుకు ప్రభుత్వం చర్యటు చేపట్టింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు చేపట్టేందుకు ప్రజల భాగస్వామ్యంతో గ్రామ సభలను నిర్వహించి వివిధ రకాల పనులను గుర్తించారు. కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే విధంగా చర్యలు చేపట్టారు. గ్రామ సభల్లో జల సంరక్షణ పనులపై అవగాహన కల్పించారు. గతంలో జల శక్తి అభియాన్, వాటర్ షెడ్‌తో పాటు పథకాలను ప్రవేశపెట్టి పలు రకాల పనులు చేపట్టారు.
జల సంరక్షణలో చేపట్టే పనులు
జల సంరక్షణలో భాగంగా చేపట్టే పనుల్లో ముఖ్యంగా వ్యవసాయ పంట పొలాల వద్ద నీరు నిలిచి ఉండే విధంగా పనులు చేపట్టనున్నారు. వాగులు, వంకలలో పూడికతీత, బోరు బావులు, చేతి పంపులు, ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణాలు, ఇంటి పై భాగంలో కురిసిన వర్షపు నీరు భూమిలోకి ఇంకే విధంగా రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణాలు, కందకాలు తవ్వటం, నీటి కుంటల నిర్మాణాలు, నీటి నిలువ కుంటలు, పర్క్యులేషన్ ట్యాంకులు, పొలాల మధ్య కాల్వలు తదితర పనులు చేపడుతారు.
2 లక్షల జాబ్ కార్డులు.. 4 లక్షల మంది ఉపాధి కూలీలు
ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పనులు కల్పించడమే లక్ష్యంగా తీసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల 19వేల మందికి జాబ్ కార్డులు మంజూరు చేయగా.. 4 లక్షల 3 వేల మంది కూలీలుగా నమోదు అయ్యారు. అందులో 1,32,000 జాబ్ కార్డులు యాక్టివ్ ఉండగా.. రెండు లక్షల 25 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు.