
నిమ్జ్‌తో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
సంగారెడ్డిజోన్: నిమ్జ్ ఏర్పాటుతో అక్కడి ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని, అందుకు అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిమ్జ్ ప్రత్యేక అధికారి రాజు, రెవెన్యూ అధికారులతో నిమ్జ్ భూసేకరణపై కలెక్టర్ క్రాంతి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో గ్రామాల వారీగా చేసిన భూసేకరణ వివరాలు, ఇంకా ఎంత సేకరణ చేయాల్సి ఉంది అన్న వివరాలను తెలుసుకున్నారు. ప్రాజెక్టు మ్యాప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రభుత్వం చేపట్టిన నిమ్జ్ ఏర్పాటుతో జహీరాబాద్ నియోజకవర్గం రూపురేఖలు మారిపోతాయన్నారు. భూములిచ్చిన వారికి నష్టపరిహారం అందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి భూ సేకరణ ప్రక్రియ వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రారంభమైన పలు అభివృద్ధి పనులను ఈనెల 24లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, జహీరాబాద్ ఆర్డీవో రామ్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ వల్లూరు క్రాంతి
రెవెన్యూ, నిమ్జ్ అధికారులతో భూసేకరణపై సమీక్ష