కల్తీ కల్లేనా..? కలుషిత నీరేనా..? రంగంలోకి దిగిన 3 శాఖలు.. | - | Sakshi
Sakshi News home page

కల్తీ కల్లేనా..? కలుషిత నీరేనా..? రంగంలోకి దిగిన 3 శాఖలు..

Jul 29 2023 6:30 AM | Updated on Jul 29 2023 1:00 PM

- - Sakshi

సంగారెడ్డి: దుబ్బాక ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. వాంతులు, విరేచనాలు ఏ కారణంతో జరిగాయి? వృద్ధుడు ఎలా మృతిచెందాడు? అనే ప్రశ్నల చిక్కుముడి విప్పడానికి 3 శాఖల అధికారులు రంగంలోకి దించింది. కల్తీ కల్లునా? కలుషిత నీరు తాగి మృతిచెందాడా? పలువురు ఎందుకు అస్వస్థతకు గురయ్యారా? అని నిర్థారించే పనిలో నిమగ్నమయ్యారు.

దుబ్బాక మండలం దుంపలపల్లి, బల్వంతపూర్‌, నర్లెంగడ్డ, పద్మశాలి గడ్డ గ్రామాలకు చెందిన వారు కూలీ పనులకు వెళ్లి వస్తున్న క్రమంలో కల్లు తాగారు. గురువారం తెల్లవారుజాము నుంచి వారికి వాంతులు, విరేచనాలై అస్వస్థతకు గురయ్యారు. 33 మందికి పైగా దుబ్బాకలో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 28 మంది ఇంటి వద్దే మందులు వాడుతున్నారు. శుక్రవారం ఉదయం పద్మశాలి గడ్డకు చెందిన కుంటయ్య (65) మృతిచెందాడు.

భిన్నాభిప్రాయాలు

కల్లు వల్లే వాంతులు, విరేచనాలు అయ్యయని కొందరు పేర్కొంటుండగా, మరికొందరు కలుషిత నీరే కారణమని కొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. వర్షాలతో కల్లు విక్రయ కేంద్రాలలో అమ్మకాలు లేక నిల్వను విక్రయించడంతోనే అస్వస్థతకు కారణమా? అన్నది తేలాల్సి ఉంది. కల్తీ కల్లుతోనే వాంతులు, విరేచనాలు అయ్యాయని వైద్యులు ప్రాథమికంగా నిర్థారించారు.

శాంపిల్స్‌ సేకరణ

ఎందువల్ల అస్వస్థతకు గురయ్యారని నిర్థారించేందుకు ఎక్సైజ్‌ శాఖ, మిషన్‌ భగీరథ, వైద్యారోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఎక్సైజ్‌ అధికారులు దుంపలపల్లి, బల్వంతపూర్‌, నర్లెంగడ్డలలోని కల్లు విక్రయ కేంద్రాల నుంచి కల్లు శాంపిల్స్‌ సేకరించారు.

మిషన్‌ భగీరథ అధికారులు ఆయా గ్రామాల్లో సరఫరా అయిన నీటిని శాంపిల్స్‌ సేకరించారు. వైద్య అధికారులు 10 మంది నుంచి బ్లడ్‌, స్టూల్‌, మూత్రం శాంపిల్స్‌ తీసి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంట్‌ మెడిసిన్‌ ల్యాబ్‌ (ఐపీఎం)కు పంపించారు. కల్తీ కల్లు తాగడంతో వృద్ధుడు మృతిచెందాడా? బాధితులు తాగు నీటితో వాంతులు, విరేచనాలయ్యాయా? అన్నది తేలాలంటే రిపోర్టు రావాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement