ఓటీఎస్‌కూ ససేమిరా..! | - | Sakshi
Sakshi News home page

ఓటీఎస్‌కూ ససేమిరా..!

Feb 1 2026 10:42 AM | Updated on Feb 1 2026 10:42 AM

ఓటీఎస్‌కూ ససేమిరా..!

ఓటీఎస్‌కూ ససేమిరా..!

మైనింగ్‌ మాఫియా రూ.974 కోట్ల రాయల్టీ ఎగవేత వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కిందసగానికి తగ్గించిన గనుల శాఖ పది నెలల క్రితం జీఓ జారీ..ముందుకు రాని మైనింగ్‌ కంపెనీలు ఈ పది నెలల్లో వసూలైందికేవలం రూ.1.57 కోట్లే

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : జిల్లాలో విచ్చలవిడిగా లూఠీ చేసిన ఖనిజ సంపదకు సంబంధించి ఎగవేసిన రాయల్టీ (జరిమానాతో కలిపి) రూ.974 కోట్లుగా ప్రభుత్వం గతేడాది తేల్చింది. ఈ మేరకు బకాయి పడిన 15 మైనింగ్‌ కంపెనీలకు డిమాండ్‌ నోటీసులిచ్చింది. ఓటీఎస్‌ కింద సగం చెల్లిస్తే మిగతా సగాన్ని మాఫీ చేస్తామని నోటీసుల్లో పేర్కొంది. ఓటీఎస్‌ జీఓ జారీ చేసి పది నెలలు దాటినా కానీ అక్రమ మైనింగ్‌ కంపెనీలు ఏమాత్రం స్పందించడం లేదు. రూ.974 కోట్ల బకాయిలకు గాను ఓటీఎస్‌ కింద రూ.1.07 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దీన్నిబట్టి చూస్తే మైనింగ్‌ మాఫియా బకాయిలు చెల్లించేందుకు ఏస్థాయిలో బెట్టు చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.

స్పందించని మైనింగ్‌ కంపెనీలు

సంగారెడ్డి జిల్లాలో స్టోన్‌ అండ్‌ మెటల్‌ క్వారీల్లో విలువైన ఖనిజ సంపద లూఠీ అవుతున్న విషయం తెలిసిందే. ఇక్కడి క్వారీల నుంచి కంకరను హైదరాబాద్‌కు తరలించి రూ.కోట్లు మైనింగ్‌ కంపెనీలు గడిస్తున్నాయి. నిత్యం వందల సంఖ్యలో భారీ వాహనాలు, టిప్పర్లలో కంకర అక్రమంగా తరలిపోతోంది. ఇక్కడి క్వారీలు సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనులను తలపిస్తున్నాయి. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ అక్రమ మైనింగ్‌పై దృష్టి సారించింది. డీజీపీఎస్‌ సర్వేలు, విచారణలు చేసి అక్రమాల నిగ్గు తేల్చింది. లూఠీ చేసిన ఈ ఖనిజ సంపదకు సంబంధించిన రూ.974 కోట్లు చెల్లించాలని 15 క్వారీలకు సంబంధించిన మైనింగ్‌ కంపెనీలు, వ్యక్తులకు నోటీసులిచ్చింది. కొన్ని మైనింగ్‌ కంపెనీల యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేసింది. అయితే ప్రభుత్వం ఇన్ని చర్యలకుపక్రమించినా ఈ మైనింగ్‌ మాఫియాకు కనీసం చీమకుట్టినట్లు కూడా లేదు. దీంతో వీరి నుంచి ఎలాగైనా బకాయిలను రాబట్టేందుకు ప్రభుత్వం ఓటీఎస్‌ జీఓను తీసుకురాగా..కేవలం మూడు కంపెనీలే నామమాత్రంగా ఈ ఓటీఎస్‌ కింద బకాయిలను చెల్లించాయి. ఓ మైనింగ్‌ కంపెనీ రూ.55.06 లక్షలు చెల్లించగా, మరో మైనింగ్‌ కంపెనీ రూ.50లక్షలు, మరో సంస్థ రూ.2.40 లక్షలు కట్టాయి. మొత్తం కలిపి 1.07 కోట్లు మాత్రమే భూగర్భ గనులశాఖకు వసూలయ్యాయి.

రాజకీయ పలుకుబడితోనే

అక్రమ మైనింగ్‌ వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా రాజకీయ నేతలే ఉన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన నాయకులు ప్రజాప్రతినిధుల కనుసనల్లోనే ఈ అక్రమ మైనింగ్‌ జరుగుతోంది. రాజకీయ అండదండలు, పలుకుబడి ఉండటంతో ఈ మైనింగ్‌ మాఫియాకు అడ్డే లేకుండా పోతోంది. సామాన్యుడు తన ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్‌లో ఇసుక తీసుకెళితే దాన్ని సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి రూ.వేలల్లో జరిమానా చెల్లించేవరకు వదిలి పెట్టని గనులశాఖ అధికారులు..ఈ మైనింగ్‌ మాఫియా నుంచి రాయల్టీ వసూలు విషయంలో మీనమేషాలు లెక్కిస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఓటీఎస్‌ కింద కొంతమొత్తంలో రాయల్టీ బకాయిలు వసూలయ్యాయని భూగర్భగనులశాఖ సంగారెడ్డి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రవిబాబు ‘సాక్షి’తో పేర్కొన్నారు. మిగిలిన బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

భూగర్భ గనుల శాఖలో పేరుకుపోయిన రాయల్టీ పెండింగ్‌ బకాయిల వసూలుకు ఆశాఖ చేపట్టిన చర్యలు ఏమాత్రం ఫలితాలనివ్వడం లేదు. ఎగవేసిన రాయల్టీ మొత్తాన్ని వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) కింద చెల్లిస్తే 50% తగ్గిస్తామని ఆశాఖ ఏడాది క్రితం జీఓను జారీ చేసింది. కానీ గనులశాఖకు రూ.వందల కోట్లు ఎగవేసిన మైనింగ్‌ మాఫియా ఈ ఓటీఎస్‌ కింద బకాయిపడిన మొత్తంలో కనీసం సగం చెల్లించేందుకు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement