What Is ECO Bridges: వన్యప్రాణుల కోసం వంతెనలు.. ఫ్లై ఓవర్‌లు.. మొదటిది ఎక్కడో తెలుసా?

Special Story On Animal Bridges In Telugu - Sakshi

పర్యావరణ పరిరక్షణ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మంత్రమిదే. వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతూ ఉండడంతో జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్నాం. అభివృద్ధి కార్యకలాపాల్లో ముందడుగు వేస్తూనే వన్యప్రాణుల్ని కాపాడడం కోసం అటవీ ప్రాంతాల నుంచి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వేలను ఎకో వంతెనలతో తీర్చిదిద్దుతున్నారు.  ఆ వంతెనల కథాకమామిషు చూద్దాం..  

మహారాష్ట్రలో నాగపూర్, ముంబై మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించిన బాలాసాహెబ్‌ ఠాక్రే సమృద్ధి మహా మార్గ్‌ (ఎక్స్‌ప్రెస్‌వే) మొదటి దశ ఎన్నో ప్రత్యేకతలతో నిండి ఉంది. మన దేశంలో నిర్మించిన పూర్తి స్థాయి తొలి ఎకో వంతెన ఇది. రోడ్లపై వెళ్లే వాహనాలకు అడ్డంగా వచ్చే వన్యప్రాణులకి ఎలాంటి హాని కలగకుండా ఈ ఎక్స్‌ప్రెస్‌ వే మార్గం పచ్చగా, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడేలా నిర్మించారు. దారిన పోయే జంతువులు, వన్యప్రాణులు నిర్భయంగా సంచరించడానికి తొమ్మిది గ్రీన్‌ వంతెనలు (ప్లై ఓవర్‌ తరహా నిర్మాణాలు), మరో 17 అండర్‌ పాపెస్‌ నిర్మించారు.

మొత్తం 701 కి.మీ. పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌ తొలిదశలో 520 కి.మీ. పూర్తి చేసుకుంది. ఈ వంతెనతో ప్రయాణికులు వన్యమృగాల భయం లేకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణించవచ్చు. మరో వైపు అవి తిరగడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఈ ఎక్స్‌ప్రెస్‌ వే పొడవున సంచరించే చిరుత పులులు రహదారులపైకి రాకుండా ఫెన్సింగ్‌ నిర్మిస్తారు. మహారాష్ట్రలో 10 జిల్లాల మీదుగా సాగే ఈ వంతెన నిర్మాణం రెండో దశ కూడా పూర్తయితే నాగపూర్, ముంబైల మధ్య 16 గంటలు పట్టే ప్రయాణ సమయం 8 గంటలు పడుతుంది.  

ఏమిటీ వన్యప్రాణుల వంతెనలు? 
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వన్యప్రాణుల రాకపోకలు సాగించడమే లక్ష్యంగా నిర్మించే వంతెనల్ని ఎకో వంతెనలు, వన్యప్రాణుల వంతెనలు అని పిలుస్తారు. అటవీ ప్రాంతాల్లో నిర్మించే హైవేలపై వాహనాలకు అడ్డంగా పడి జంతువులు ప్రాణాలు పోకుండా ఉండడం కోసం కూడా ఈ వంతెనల్ని నిర్మిస్తున్నారు. టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో ఎకో వంతెనల నిర్మాణం సాగుతోంది.  

ఎకో వంతెనలు ఎన్ని రకాలు ? 
ఈ ఎకో వంతెనలు మూడు రకాలున్నాయి. చిన్న చిన్న పాలిచ్చే జంతువుల్ని కాపాడడం కోసం ఉద్దేశించిన కల్వర్టులు. వీటికే ఆంఫిబియాన్‌ వంతెనలని పిలుస్తారు. ఇక రెండో రకం కానోపి బ్రిడ్జెస్‌. కోతులు, ఉడతలు వంటి చెట్లపై నివసించే వాటిని రక్షించడానికి సులభంగా రాకపోకలు సాగించడానికి చెక్కలతో ఈ వంతెనల్ని  నిర్మిస్తారు. ఇక కాంక్రీట్‌తో నిర్మించే అండర్‌పాసెస్, ఓవర్‌ పాస్‌ టన్నెల్స్‌. పులులు, ఏనుగులు వంటి పెద్ద పెద్ద జంతువులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించడం కోసం వీటిని నిర్మిస్తారు.  ఈ ఎకో వంతెనల నిర్మాణం సాగించడానికి ముందు ఆయా దేశాలకు చెందిన పర్యావరణ పరిరక్షకులు వాటిని నిర్మించే ప్రాంతం, సైజుని అధ్యయనం చేస్తారు. ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇచ్చిన తర్వాతే వీటి నిర్మాణం సాగుతుంది.  

మొదటి వంతెన ఎక్కడ ? 
ఫ్రాన్స్‌లో 1950 సంవత్సరంలో ఈ ఎకో వంతెనల నిర్మాణం మొదలైంది. ఆ తర్వాత స్కాట్‌ల్యాండ్, బ్రిటన్‌ వంటి దేశాలు వీటి నిర్మాణంపై మక్కువ చూపించాయి. మొత్తమ్మీద యూరప్‌ దేశాల్లో ఈ ఎకో బ్రిడ్జీల నిర్మాణం ఎక్కువగా జరుగుతోంది. వాహనాల కింద పడి ప్రమాదవశాత్తూ జంతువులు మరణిస్తూ ఉండడంతో మన దేశంలో ఉత్తరాఖండ్‌లోని కలాధుంగి–నైనిటాల్‌ హైవే మధ్య రామ్‌నగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌లో చెట్లపై తిరుగాడే జంతువుల కోసం 90 అడుగుల పొడవైన వంతెన నిర్మించారు.  
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌     

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top