వీడేం హీరోరా బాబూ.. ఇలా ఉన్నాడు!.. ఆ అవమానంతో ఏడేళ్లు అజ్ఞాతంలోకి..

Happy Birthday Fahadh Faasil: Interesting Facts About Fahadh Faasil - Sakshi

మాలీవుడ్‌లో బడా స్టార్లు ఎవరంటే.. టక్కున మమ్మూటీ, మోహన్‌లాల్‌ల పేర్లు, ఇతర భాషల్లోనూ వాళ్ల పోస్టర్లే ఎక్కువ కనిపిస్తాయి.మరి వీళ్లిద్దరి తర్వాత ఎవరంటే.. ఫహద్ ఫాజిల్ అనే పేరు మలయాళ సినిమాకు కొత్త పోస్టర్ ముఖంగా మారిపోయింది ఇప్పుడు. ఆ ముఖమే ఇప్పుడు అన్ని భాషల్లోనూ ప్రేక్షకులను అలరిస్తోంది కూడా.

సోకాల్డ్‌ హీరోకు ఉండాల్సిన లక్షణాలు ఏవీ కనిపించవు. బక్కపల్చని శరీర సౌష్టవం, బట్టతల, ఐదున్నర అడుగుల ఎత్తు, గడ్డం, పొడి పొడి మాటలు. కానీ, నటనకొచ్చేసరికి విశ్వరూపం ప్రదర్శిస్తుంటాడు. ఏ విషయంలోనూ హెచ్చుతగ్గులు లేకుండా కంప్లీట్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది ఆయన నటన. అందుకేనేమో ఆ క్రేజ్‌ను వాడుకునేందుకు అన్ని భాషలూ ఇప్పుడు అతన్ని అక్కున చేర్చుకుంటున్నాయి. 

నటన కొందరి బ్లడ్‌లో ఉంటుంది. మరికొందరికి శిక్షణ తీసుకుంటేనే అబ్బుతుంది. కానీ, ఈయనకి మాత్రం కంటిచూపులోనే ఉంది. ఈ మాట అంది ఎవరో కాదు.. యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌. విక్రమ్‌లో తన కో-స్టార్‌  ఫహద్‌ ఫాజిల్‌ను ఆకాశానికి ఎత్తేశాడు కమల్‌. అంతపెద్ద సీనియర్‌ నటుడికే కాదు.. ఫహద్‌పై ఇండస్ట్రీలో, బయటా చాలామందికి ఉన్న అభిప్రాయం ఇదే. అందుకే ఫహద్‌ను విలక్షణ నటుడు అనడం కంటే అసాధారణమైన నటుడు అనడం కరెక్ట్‌.

వీడేం హీరోరా బాబూ..  
ఫహద్‌ది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి ఫాజిల్‌ పెద్ద డైరెక్టర్‌ కావడంతో హీరో అయ్యేందుకు ఉవ్విళ్లూరాడు. డిగ్రీ చదివే టైంలో 19 ఏళ్లకే ముఖానికి మేకప్‌ వేసుకున్నాడు ఫహద్‌. 2002లో తొలి చిత్రం ‘కైయేథుమ్‌ దురత్‌’ రిలీజ్‌ అయ్యింది. తండ్రి డైరెక్షన్‌, లవ్‌ స్టోరీ, పైగా మమ్మూట్టి గెస్ట్‌ రోల్‌.. ఇంకేం సినిమాపై హైప్‌ పెరిగిపోయింది. కానీ, ఫలితం మాత్రం భారీ డిజాస్టర్‌. అందునా ఫహద్‌ ఫాజిల్‌ వల్లే సినిమా పోయిందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వెంట్రిలాక్విజం బొమ్మలా ఉన్నాడని.. ఏ కోణంలోనూ అతను హీరోగా పనికి రాడంటూ క్రిటిక్స్‌ సైతం రివ్యూలతో ఏకీపడేశారు.

నిజాయితీగా ఒప్పుకుని.. 
తన తండ్రి ఫాజిల్‌ తప్పేం లేదని, ఎలాంటి ప్రిపరేషన్‌ లేకుండా వచ్చి ఆ అంచనాలు తానే అందుకోలేకపోయానని నిజాయితీగా ఒప్పేసుకున్నాడు ఫహద్‌. ఆపై యాక్టింగ్‌ను వదిలేసి.. అమెరికాకు వెళ్లిపోయాడు. అక్కడే ఐదేళ్ల పాటు ఏంఎ ఫిలాసఫీ చేశాడు. ఘోరమైన అవమానం-విమర్శల తర్వాత యూఎస్‌ వెళ్లిపోయిన ఫహద్‌.. దాదాపు ఏడేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. తండ్రి ప్రొత్సాహంతో ఈసారి దర్శకుడు రంజిత్‌ డైరెక్షన్‌లో ‘కేరళ కేఫ్‌’(2009)తో రీ-ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి నటుడిగా ఫహద్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 

ఇతనొక ప్రయోగశాల 
చప్పా ఖురిష్‌, డైమండ్‌ నెక్లెస్‌, 22 ఫిమేల్‌ కొట్టాయం, అన్నయుమ్ రసూలుమ్‌, బెంగళూరు డేస్‌, మహేషింటే ప్రతీకారం.. ఇలా వరుస హిట్లు నటుడిగా ఫహద్‌ను ఎస్టాబ్లిష్‌ చేశాయి. హిట్‌ ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోయింది ఫహద్‌ సినీ కెరీర్‌. ఒకానొక స్టేజ్‌కి వచ్చేసరికి మాలీవుడ్‌లో టాప్‌ రెమ్యునరేషన్‌ అందుకునే హీరోల జాబితాలోకి చేరిపోయాడు ఫహద్‌. ‘కుంబళంగి నైట్స్‌’, ‘టేకాఫ్‌’, ‘ఎన్‌జన్‌ ప్రకాశన్‌’, ‘వారాతన్‌’ లాంటి కమర్షియల్‌ హిట్స్‌ మాత్రమే కాదు..‘ట్రాన్స్‌’, ‘సీయూసూన్‌’, ‘జోజి’ ‘మాలిక్‌’, ‘మలయన్‌కుంజు’లాంటి ప్రయోగాలు చేసి మాలీవుడ్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు. 

నేషనల్‌ అవార్డు
ప్రత్యేకించి మలయాళ సినీ పరిశ్రమకు ప్రయోగాలకు, కొత్త జానర్లను, కొత్త సాంకేతికతను పరిచయం చేసిన నటుడిగా ఫహద్‌ పేరు ముద్రపడిపోయింది. ఇక తొండిముథలం ద్రిక్‌సాక్షియుం(2017) ఏకంగా నేషనల్‌ అవార్డును(బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌) తెచ్చిపెట్టగా.. స్టేట్‌, సౌత్‌ అవార్డులను సైతం అందుకున్నాడు. కరోనా తర్వాత వరుస ఓటీటీ రిలీజ్‌లతో సౌత్‌ ఆడియొన్స్‌కు బాగా దగ్గరయ్యాడు ఫహద్‌. నిర్మాతగానూ సూపర్‌ హిట్లు అందుకుంటున్నాడు ఫహద్‌. ఇక తమిళంలో శివకార్తీకేయన్‌ ‘వెళ్లైక్కారన్‌’(తెలుగులో జాగో)తో డెబ్యూ ఇచ్చిన ఫహద్‌.. ఆపై సూపర్‌ డీలక్స్‌లో సమంత భర్త పాత్రలో అలరించాడు. తెలుగులో పుష్ప భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పాత్రలో ‘పార్టీ లేదా పుష్ప?’ అంటూ మెప్పించాడు. ఇక ఈ ఏడాది ఓటీటీ సినిమాల ద్వారా తన హవా కొనసాగించిన ఫహద్‌ పాజిల్‌.. ఈ ఏడాది రిలీజ్‌ అయిన కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’లో ఏజెంట్‌ అమర్‌ రోల్‌తో మరింత మంచి పేరు సంపాదించుకున్నారు. 

:::ఇవాళ ఫహద్‌ ఫాజిల్‌ 40వ పుట్టినరోజు సందర్భంగా.. 

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top